విపత్తులకు ప్రకృతికాదు.. మనుషులే కారణం :హైకోర్టు

విపత్తులకు ప్రకృతికాదు.. మనుషులే కారణం :హైకోర్టు
  • ఆక్రమణలను అడ్డుకోకుండా పట్టాలు జారీ చేస్తున్నరు
  • రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం సంభవిస్తున్న విపత్తులకు ప్రకృతి కారణం కాదని, మనుషుల చర్యలే మూల కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. చెరువుల, కుంటల ఆక్రమణలను అడ్డుకోకుండా పట్టాలు జారీ చేస్తున్నారంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అన్నింటికీ రెవెన్యూ శాఖపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆ శాఖను రద్దు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. పరిశీలిస్తే పోలీసు శాఖకంటే దారుణంగా ఉంది’’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెలలో సర్వే నం. 11, 12, 13, 29, 30, 31లోని పట్టా భూమిని కాకతీయ మిషన్ పథకంలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ సంజీవరెడ్డి మరో ఏడుగురు రైతులు 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారించారు.  పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..అధికారులు ఏకపక్షంగా చెరువు నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిని పెంచి, పట్టా భూములను ఆక్రమణలుగా చూపించారని పేర్కొన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదిస్తూ.. నీటిమట్టం పెరిగినప్పుడు ఎఫ్‌టీఎల్ పరిధిని పెంచే అధికారం నీటిపారుదల శాఖకు ఉందని వాదించారు.

 న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. నీటి మట్టం స్థాయిని ఏ చట్టం కింద పెంచారని, అలా పెంచినట్లయితే ముంపునకు గురయ్యే పంటకు నష్టపరిహారం చెల్లించాలి కదా అని ప్రశ్నించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కౌంటర్లు దాఖలు చేయకపోవడం అధికారులకు అలవాటుగా మారిందని, 9 ఏండ్లయినా కౌంటరు దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించే పరిధి నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీలకు లేదన్నారు. ప్రస్తుత కేసులో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కలెక్టర్‌కు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.