పుప్పాలగూడ ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే

పుప్పాలగూడ ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే
  • 11 ఎకరాల్లో వేసిన 5 ప్లాట్లను అర్రాస్ పెట్టొద్దు
  • టైటిల్ కూడా లేకుండా భూముల వేలమా?
  • ఒకే ప్లాట్ రెండు సర్వే నంబర్లలో ఎట్లుంటది
  • కాందిశీకుల భూమిపై సర్కార్ కు హక్కులుండవు
  • సర్వే నంబర్లతో గిమ్మిక్కులు చేస్తే కుదరదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: టైటిల్ కూడా లేకుండా భూమిని ఎట్ల అర్రాస్ వేస్తారని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ప్రశ్నించింది. కాందిశీకుల భూమిపై ప్రభుత్వానికి హక్కు ఉండదని.. వాటిని కాపాడే బాధ్యత మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని కొన్ని ప్లాట్ల వేలానికి మంగళవారం హైకోర్టు బ్రేక్‌‌ వేసింది. పిటిషనర్‌‌కు చెందిన 11 ఎకరాల్లోని 5 ప్లాట్లను వేలం వేయడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ల భూమి వేరే సర్వే నంబర్‌‌లో ఉందని, దాన్ని వేలం వేయట్లేదని సర్కార్ చెప్పడంపై ధర్మాసనం సందేహాన్ని వ్యక్తం చేసింది. భూమి–సర్వే నంబర్‌‌ వివాదంతో సంబంధం లేకుండా పిటిషనర్‌‌కు చెందిన భూమిలో వేసిన 25వ నంబర్ ప్లాట్ నుంచి 30వ నంబర్ ప్లాట్​వరకు వేలం వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సర్వే నంబర్లతో గిమ్మిక్కులు చేస్తే కుదరదని, ఒక ప్లాట్‌‌లో రెండు సర్వే నంబర్లు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌‌ఐఐసీ, హెచ్‌‌ఎండీఏలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు యాక్టింగ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ ఎంఎస్‌‌ రామచందర్‌‌రావు, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వేలం చట్ట వ్యతిరేకం
పుప్పాలగూడలోని సర్వే నెం. 301లోని 11 ఎకరాల భూమిని 2006 జులై 31న తాము కొనుగోలు చేశామని.. అయితే హెచ్‌‌ఎండీఏ తమ భూముల్ని చట్ట వ్యతిరేకంగా వేలం వేయబోతోందంటూ లక్ష్మీ ఇంజినీరింగ్‌‌ అండ్‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌ మేనేజింగ్‌‌ పార్టనర్‌‌ పి.నందకుమార్‌‌ రిట్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఆ భూములు నవలాల్‌‌మాల్‌‌ ప్రజ్వానీ అనే కాందిశీకుడికి 1950వ దశకంలో కాందిశీక చట్టం కింద రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు లభించాయని, ఆ భూమిపై సర్వహక్కులు ఆయనకు సంక్రమించాయని పిటిషనర్‌‌ తరఫు సీనియర్‌‌ న్యాయవాది వై.చంద్రశేఖర్‌‌ వాదించారు. భూములకు సంరక్షకుడిగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం భూమిపై హక్కు ఉన్నట్లుగా వేలం వేయడానికి సిద్ధపడటం చట్ట వ్యతిరేకమన్నారు. పిటిషనర్‌‌ 11 ఎకరాలను ప్రజ్వానీ వారసుల నుంచి కొనుగోలు చేసిన రిజిస్టర్‌‌ సేల్‌‌ డీడ్స్‌‌ కూడా ఉన్నాయని చెప్పారు. ప్రజ్వానీకి బొంబే సెటిల్‌‌మెంట్‌‌ కమిషనర్‌‌ 1955లో అలాట్ మెంట్‌‌ లెటర్‌‌ ఇచ్చారని, 1956లో రీజినల్‌‌ సెటిల్‌‌మెంట్‌‌ కమిషనర్‌‌ రాష్ట్రపతి పేరిట భూమికి పట్టా హక్కులు కల్పించారని తెలిపారు. మరో న్యాయవాది ఎ.సత్యసిరి వాదిస్తూ, ప్రభుత్వం 42 ఎకరాలనే వేలం వేసేందుకు టీఎస్‌‌ఐఐసీకి అనుమతి ఇస్తే 99 ఎకరాలను వేలం వేసేందుకు నోటిఫికేషన్‌‌ ఇచ్చిందన్నారు. ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా జారీ చేసిన నోటిఫికేషన్‌‌ చెల్లదన్నారు.

ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది హరేందర్‌‌ పరిషద్‌‌ వాదిస్తూ, పిటిషనర్‌‌ భూములు సర్వే నం.302లో ఉన్నాయని, ఆ భూములకు టీఎస్‌‌ఐఐసీ వేలం వేసే భూములకు సంబంధం లేదన్నారు. దీనిపై స్పందించిన డివిజన్‌‌ బెంచ్‌‌.. టైటిల్‌‌ కూడా లేకుండా భూముల్ని ఎట్ల వేలం వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేరే సర్వే నంబర్‌‌లో పిటిషనర్‌‌ భూమి ఉందని ప్రభుత్వం చెప్పడం సరికాదంది. కాందిశీకుల చట్టం కింద ఇచ్చిన భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండదని, కేవలం సంరక్షణ బాధ్యత మాత్రమే రాష్ట్రానికి ఉంటుందని అభిప్రాయపడింది. అవకాశం కోసం సర్వే నెంబర్లు వేర్వేరుగా చెప్పడం సరికాదని, ఒకే ప్లాట్‌‌ రెండు సర్వే నంబర్లల్లో ఎట్లుందని, కావాలని గిమ్మిక్కులు చేస్తున్నారనే అనుమానం ఉందని వ్యాఖ్యానించింది. అందుకే సర్వే నంబర్లతో సంబంధం లేకుండా పిటిషనర్లు తమదని చెబుతున్న భూమిలోని ప్లాట్లను వేలం వేయడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్​పై కేబినెట్ సబ్ కమిటీ
కేటీఆర్ చైర్మన్ గా ఆరుగురు మంత్రులతో ఏర్పాటు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లు, ఇండ్ల స్థలాలు, ప్లాట్ల రెగ్యులరైజేషన్, గ్రామకంఠం భూములకు సంబంధించిన సమస్యలపై స్టడీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు సంబంధించిన సమస్యలపై ఈ కమిటీ స్టడీ చేసి అసెంబ్లీకి రిపోర్టు అందజేయనుంది.