హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న శరణార్థులు, రోహింగ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉందా? అని బుధవారం హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ వలసదారులపై చైతన్య సదస్సు నిర్వహణకు అనుమతుల మంజూరుకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ శరణార్థుల వ్యవహారం కేంద్రం పరిధిలోనిదని, వలసదారులను వెనక్కి పంపాలా? లేదా? అన్నది కేంద్రం నిర్ణయమన్నారు.
అక్రమ వలసదారులతో దేశ భద్రతకు కలుగుతున్న ఇబ్బందులపై చైతన్యం కల్పించడంలో భాగంగా 24న రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో ‘ధర్మ రక్ష సభ’ నిర్వహించాలనుకున్నారు. దీనికి అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుపై పోలీసులు నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్. బ్రహ్మచారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ధర్మ రక్ష సభకు షరతులతో అనుమతి మంజూరు చేస్తున్నామన్నారు.
