పోలీసు రిక్రూట్మెంట్ నిరసనలపై కేసు కొట్టివేత: తీర్పు వెలువరించిన హైకోర్టు

పోలీసు రిక్రూట్మెంట్ నిరసనలపై కేసు కొట్టివేత: తీర్పు వెలువరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పోలీసు రిక్రూట్‌‌మెంట్‌‌లో అవకతవకలు జరిగాయంటూ నిరసన చేసిన అభ్యర్థులపై పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. పోలీసు నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పోలీస్  కమాండ్‌‌  కంట్రోల్‌‌ సెంటర్‌‌  వద్ద ఆందోళన నిర్వహించిన 16 మందిపై 2023 ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ట్రాఫిక్‌‌కు అంతరాయం కలిగించారని, ఆస్తుల స్వాధీనానికి ప్రయత్నించారని, పోలీసు అధికారుల విధులను అడ్డుకున్నారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు.

ఆ కేసును కొట్టివేయాలని కె.మహేశ్‌‌ తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్‌‌  దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌  కె.లక్ష్మణ్‌‌  విచారణ చేపట్టారు. పిటిషనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే నిరసన వ్యక్తం చేశారని, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ అడ్డుకోలేదన్నారు. దర్యాప్తు అధికారి సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించలేదన్నారు. నేరపూరితంగా విధులను అడ్డుకున్నట్లు పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించలేదన్నారు. సరైన ఆధారాలు లేవని పిటిషనర్లపై కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.