ఎకరా రూ.100 కోట్లకు అమ్ముతూ.. బీఆర్​ఎస్​కు అగ్గువకే ఎట్లిస్తరు?

ఎకరా రూ.100 కోట్లకు అమ్ముతూ.. బీఆర్​ఎస్​కు అగ్గువకే ఎట్లిస్తరు?
  • రాష్ట్ర సర్కార్​ను నిలదీసిన హైకోర్టు
  • కోకాపేటలో 11 ఎకరాల 
  • భూ కేటాయింపులపై ఆగ్రహం
  • ఎకరాకు వందకోట్లు రాబట్టేలా 
  • ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ‘‘రూ. 100 కోట్లకు ఎకరం చొప్పున భూమిని అమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీఆర్​ఎస్​ పార్టీకి మాత్రం వంద రూపాయలకే చదరపు అడుగు చొప్పున ఇచ్చేయడం ఏమిటి?” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోకాపేటలో బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు కోసం 11 ఎకరాల భూమిని అగ్గువకే కట్టబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అవసరమైతే ఎకరాకు వంద కోట్ల రూపాయల వసూలు కోసం, అదీ వారం రోజుల్లోగా చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో విలువైన 11 ఎకరాల భూమిని బీఆర్‌‌ఎస్‌‌కు దాదాపు రూ. 37.50 కోట్లకే కట్టబెట్టడాన్ని, జిల్లాల్లోనూ అతి తక్కువ ధరకే కేటాయించడాన్ని సవాల్​ చేస్తూ  ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ జనరల్‌‌ సెక్రటరీ ఎం. పద్మనాభరెడ్డి గతంలో హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. దీన్ని బుధవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్​తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. 

పిల్‌‌ విచారణకు రాగానే కౌంటర్‌‌ దాఖలుకు మూడు వారాల టైమ్​ కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌‌ పరిషద్‌‌ కోరారు. దీనిపై పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్​ చిక్కుడు ప్రభాకర్‌‌ తీవ్ర అభ్యంతరం చెప్పారు. 15 నెలలుగా కౌంటర్​ దాఖలు చేస్తలే: పిటిషనర్​గత 15 నెలలుగా ప్రతివాదులు కౌంటర్‌‌ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని డివిజన్​ బెంచ్​ దృష్టికి పిటిషనర్​ తరఫు అడ్వకేట్​ తీసుకెళ్లారు. మరింత టైమ్​ కావాలని అడుగుతున్నారని, ఈలోగా ఆయా భూముల్లో నిర్మాణాలు చేస్తే ప్రజల ఆస్తికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇటీవల హెచ్‌‌ఎండీఏ  నిర్వహించిన భూముల వేలంలో కోకాపేట ఏరియాలో ఎకరం ధర రూ.100 కోట్లు పలికిందని, అక్కడికి సమీపంలోని 11 ఎకరాలను అధికారపార్టీ ఆఫీసు కోసం అగ్గువకు ఇవ్వడాన్ని అడ్డుకోవాలని కోరారు. శిక్షణ, వ్యక్తిత్వ వికాసం పేరుతో ఇన్​స్టిట్యూట్‌‌ ఫర్‌‌ ఎక్స్‌‌ లెన్స్‌‌ హ్యూమన్‌‌ రిసోర్స్‌‌ డెవలప్‌‌ మెంట్‌‌ ఏర్పాటు చేస్తామని చెప్పి బీఆర్‌‌ఎస్‌‌ జనరల్‌‌ సెక్రటరీ అప్లికేషన్‌‌ పెట్టుకున్నారని, జాతీయస్థాయి గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ ఉండగా అదే పేరుతో బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి భూమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. భూ కేటాయింపు ప్రక్రియ కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.  

అధికారంలో ఉన్న పార్టీకి పాలకులు మేలు చేసేలా ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి 11 ఎకరాల భూమి కేటాయింపుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్​ తరఫు అడ్వకేట్​ కోరారు. ఆ భూమిలో ఎలాంటి నిర్మాణ, ఇతర చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. భూమి కేటాయింపునకు సంబంధించిన వివరాలు పబ్లిక్‌‌ డొమైన్‌‌లో ప్రభుత్వం పెట్టలేదన్నారు. అతి కష్టం మీద మెమో.. (సి.నెం.12425/ల్యాండ్‌‌ అడ్మిషన్‌‌.11 (2)/2023 లభించిందని చెప్పారు. కోకాపేట ఏరియాలో బీఆర్​ఎస్​కు రూ.3,41,25,000కే ఎకరం లెక్కన 11 ఎకరాలు రూ. 37.50 కోట్లకు ఇచ్చారని తెలిపారు. ఆ 11 ఎకరాల భూమి   రూ.500 కోట్లకుపైగా విలువైందని వివరించారు. 

బీఆర్​ఎస్​కు బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నెం 12లో ప్రధాన కార్యాలయం ఉందని, ఇప్పుడు మళ్లీ భూమి ఇవ్వడం అన్యాయమన్నారు. హైకోర్టు స్పందిస్తూ.. ఎకరానికి రూ. 100 కోట్లకు అమ్ముతున్న ప్రభుత్వం, బీఆర్ఎస్​కు మాత్రం అతితక్కువ ధరకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని మండిపడింది. కౌంటర్‌‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో విచారణను మూడు వారాలకు వాయిదా పడింది. ఈలోగా ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌‌ఎండీఏ కమిషనర్, ల్యాండ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ (సీసీఎల్‌‌ఏ) చీఫ్‌‌ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, బీఆర్​ఎస్​ జనరల్‌‌ సెక్రటరీ ఇతరులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.