హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) అధికారులను పర్సన్ ఇన్చార్జులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పీఏసీఎస్ చైర్మన్లనే ఆ పదవుల్లో కొనసాగించాలంటూ దాఖలైన కేసుల్లో హైకోర్టు గతంలో స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 597ను జారీ చేసిందంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిని జస్టిస్ మాధవీదేవి విచారించి కౌంటర్ దాఖలు చేయాలని వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి, కమిషనర్ కు నోటీసులు జారీచేశారు.
తదుపరి విచారణను జనవరి 30కి వాయిదా వేశారు. పీఏసీఎస్ ఇన్చార్జ్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగించాలని కోర్టు చెప్పినా అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారంటూ కామారెడ్డి జిల్లా రాజంపేట్ గామానికి చెందిన నల్లవెల్లి అశోక్ ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఒక అధికారిని చట్టంలో సెక్షన్ 115డీ3బీ కింద పీఏసీఎస్ ఇన్ చార్జ్ గా నియమించడానికి వీల్లేదని తెలిపారు.
