తప్పుడు రికార్డులు సమర్పించుడేంది?. అధికారులపై హైకోర్టు మండిపాటు

తప్పుడు రికార్డులు సమర్పించుడేంది?. అధికారులపై హైకోర్టు మండిపాటు

హైదరాబాద్‌‌, వెలుగు : మల్లన్నసాగర్‌‌ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌‌పల్లిలో భూసేకరణకు చెందిన గెజిట్‌‌  జారీలో తప్పుడు రికార్డులు సమర్పించిన ఆఫీసర్లపై హైకోర్టు విరుచుకుపడింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టును తప్పుదోవ పట్టించారని మండిపడింది. ఏడాది వివరాలు ఒకచేతి రాత, ఇంక్‌‌తో ఎలా రాశారని నిలదీసింది. ఇదంతా ఇటీవల తయారు చేసిన రికార్డులా కనిపిస్తున్నదని పేర్కొంది. ముట్రాజ్‌‌పల్లిలో సర్వే నంబర్‌‌ 326, 331కి సంబంధించిన భూసేకరణ రికార్డులను సీల్డ్‌‌  కవర్‌‌లో సమర్పించాలని ఆదేశించింది.

 ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌‌ను సవాల్‌‌ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్‌‌  హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సింగిల్‌‌ జడ్జి బెంచ్  కొట్టివేయడంతో బాలాజీ స్పిన్నర్స్  మరోసారి అప్పీల్‌‌  చేసింది. ఈ అప్పీల్ ను చీఫ్‌‌  జస్టిస్‌‌  అలోక్‌‌  అరాధే, జస్టిస్‌‌  వినోద్‌‌ కుమార్‌‌  డివిజన్‌‌  బెంచ్‌‌  బుధవారం విచారించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు గెజిట్‌‌ జారీకి సంబంధించిన రిజిస్టర్‌‌ను ప్రభుత్వ న్యాయవాది బెంచ్ కు అందజేశారు. రికార్డులను సమర్పించడానికి 3వారాల గడువు అడగ్గా.. సెప్టెంబరు 4వరకు  టైమ్​ ఇచ్చింది.