- లైంగిక వేధింపుల కేసులో ఎన్‌సీడబ్ల్యూ నిర్ణయంపై వివరణ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపులపై నమోదైన ఫిర్యాదును మూసివేసిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) నిర్ణయంపై హైకోర్టు వివరణ కోరింది. ఫిర్యాదును సరైన విచారణ లేకుండానే ముగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీడబ్ల్యూ, హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి), సంస్థ డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేశ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆస్కిలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న 58 ఏండ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
తనపై డీజీ నిమ్మగడ్డ రమేశ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు ముందుగా సంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీని, అనంతరం ఎన్‌సీడబ్ల్యూను ఆశ్రయించినట్లు కోర్టుకు వివరించారు. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని పేర్కొన్ఆరు. బాధితురాలికి వ్యక్తిగతంగా వాదనలు వినిపించే అవకాశం కూడా కల్పించలేదన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత డీజీ ప్రతీకార ధోరణితో వ్యవహరించారని తెలిపారు. ఎన్‌సీడబ్ల్యూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి, అంతర్గత కమిటీ ద్వారా ఫిర్యాదుపై విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ చేసిన ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణను కోర్టు వచ్చే నెల 1కి వాయిదా వేసింది.
