- కౌంటర్ వేయకపోతే విచారణకు హాజరుకావాలన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన అప్పీలుపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయకపోతే జనవరి 9న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్ ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలంలో సిటీ ప్లానర్లు జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు సంబంధించి రికార్డుల పరిశీలన నిమిత్తం సమాచార హక్కు చట్టం కింద అనుమతించకపోవడంతో సికింద్రాబాద్‌కు చెందిన శ్యాం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఆర్టీఐ కింద పిటిషనర్ దాఖలు చేసిన అప్పీలును 4 వారాల్లో పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.
గత ఏడాది నవంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై శ్యాం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి జీహెచ్‌ఎంసీ ప్రస్తుత, మాజీ కమిషనర్లకు నోటీసులిస్తూ జనవరి 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఒకవేళ చేయకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేశారు. గడువులోగా కౌంటర్ దాఖలు చేయకపోతే ఖర్చుల కింద 10 వేల రూపాయలను రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు చెల్లించాలని ఆదేశించారు.

