- హై కోర్టు జడ్జి శ్యామ్ కోషి
కామారెడ్డి, వెలుగు : మహిళలపై వేధింపుల నిరోధం చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్, హైకోర్టు జడ్జి పి.శ్యామ్ కోషి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో రాష్ర్ట, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘మహిళలు, పిల్లల రక్షణ సామాజిక బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం అందించాలన్నారు.
బాల్య వివాహాలు చేస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏడాదికల్లా జిల్లాలో మార్పు తీసుకురావాలన్నారు. అనంతరం వలంటీర్లకు ప్రశంసా పత్రాలు, వృద్ధులకు వీల్ చైర్లు అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, జడ్జీలు సుష్మ, సుమలత, దీప, ఎస్పీ రాజేశ్చంద్ర, అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త బిల్డింగ్‌ల కోసం హైకోర్టు జడ్జిలకు వినతి..
కామారెడ్డి జిల్లా కోర్టుకు కొత్త బిల్డింగ్‌ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన హై కోర్టు జడ్జిలు శ్యామ్ కోషి, నందికొండ నర్సింగరావులకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేశ్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రతినిధులు జగన్నాథం, రమేశ్‌చంద్, శ్యాంగోపాల్‌రావు, దామోదర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు.
