గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన..డీజీపీకి హైకోర్టు నోటీసులు

గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన..డీజీపీకి హైకోర్టు నోటీసులు

ఎల్బీనగర్ గిరిజన మహిళపై దాడి కేసులో రాష్ట్ర డీజీపీ, హోంశాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ పోలీస్ కమిషనర్, ఎల్బీనగర్ డీసీపీ,ఏసీపీ,ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.   చీఫ్‌ జస్టిస్‌కు జడ్జి సూరేపల్లి నంద  రాసిన లేఖను పరిగణలోకి తీసుకుని  కేసును  సుమోటగా తీసుకుంది హైకోర్టు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలను సమర్పించాలని  ఆదేశించింది. కేసుకు సంబంధించిన ఎంక్వైయిరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. 

బాధిత మహిళ హైదరాబాద్ వచ్చి తన ముగ్గురు పిల్లలతో కలిసి మీర్ పేట్, నంది హిల్స్ లో ఉంటోంది. స్థానికంగా ఇండ్లలో పని చేసుకుంటోంది. ఆమె పెద్ద బిడ్డకు ఆగస్టు 30న పెండ్లి జరగాల్సి ఉంది. అయితే, ఆగస్టు 15న దేవరకొండలోని బంధువుల ఇంటికి వెళ్లిన వరలక్ష్మి రాత్రి తిరిగి వస్తూ ఎల్బీ నగర్ లో బస్సు దిగింది. ఆటోలు, బస్సులు లేకపోవడంతో రోడ్డు పక్కన నిలబడింది. పెట్రోలింగ్ కు వచ్చిన ఎల్బీ నగర్ పోలీసులు వరలక్ష్మిని ప్రశ్నించారు. ఆమె వద్ద డబ్బులు కూడా ఉండటంతో అనుమానించి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎస్సై కూడా ఉన్నారని, తన బిడ్డ పెండ్లి కార్డును కూడా చూపినా వదలలేదని బాధితురాలు వెల్లడించింది.  తనను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినందుకే.. ఎదురు మాట్లాడతావా అంటూ పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారని, పొద్దున ఆటోలో ఇంటికి పంపారని తెలిపింది.   ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ చౌహాన్ సస్పెండ్ చేశారు.