రామప్పను నిర్లక్ష్యం చేస్తే దేశం క్షమించదు

రామప్పను నిర్లక్ష్యం చేస్తే దేశం క్షమించదు
  • యునెస్కో గుర్తింపు నిలబెట్టుకోవాలి: హైకోర్టు
  • మంచి అవకాశాన్ని వదులుకోవద్దని సూచన
  •  ఆలయం పరిధిలోని చిన్న గుళ్ల శిథిలావస్థపై ఆవేదన
  • మీడియా కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు
  •  కేంద్ర, రాష్ట్ర ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు
  • ఆగస్టు 4న మీటింగ్ పెట్టి రిపోర్ట్ ఇయ్యాలని ఆదేశం

యునెస్కో గుర్తింపు పొందే అవకాశం రావడం ఆషామాషీకాదు, శక్తివంచన లేకుండా కృషి చేస్తేనే ఆ గుర్తింపు నిలుస్తుంది. వచ్చే డిసెంబర్‌లో ఇచ్చే రిపోర్టు చాలా కీలకం. దాని విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా, అశ్రద్ధ చూపినా దేశం క్షమించదు.     ‑ హైకోర్టు
హైదరాబాద్, వెలుగు:రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం గొప్ప విషయమని దాన్ని చేజార్చుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గుడితోపాటు దాని పరిధిలోని చిన్నచిన్న ఆలయాలనూ కాపాడుకునే చర్యలు తీసుకోకపోతే మహత్తర అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ అవకాశాన్ని వదులుకుంటే దేశం మొత్తం నిందిస్తుందని తెలిపింది. రామప్ప ఆలయ పరిస్థితిపై పత్రికల కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరిపింది. 

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ బుధవారం దీని విచారణ చేపట్టింది. రామప్ప ఆలయంతోపాటు బఫర్‌ జోన్‌లో చిన్నచిన్న ఆలయాలు శిథిలావస్థకు చేరాయని పత్రికల్లో వార్తలు వచ్చాయని.. వాటి దుస్థిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాకతీయుల కాలం నాటి చిన్న ఆలయాల్ని కూడా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వాటి పరిరక్షణకు, నిర్వహణకు ప్లాన్ రెడీ చేయాలని, అన్ని శాఖలూ కలిసికట్టుగా పనిచేస్తే యునెస్కో గుర్తింపునకు సార్థకత లభిస్తుందని చెప్పింది. ఈ అవకాశాన్ని వదులుకుంటే యావత్‌ దేశం క్షమించదని హెచ్చరించింది. యునెస్కో గుర్తింపును నిలబెట్టుకునేందుకు ప్రభుత్వపరంగా చాలా ప్రయత్నాలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రామప్ప ఆలయంపై ఇంటర్నేషనల్‌ స్మారక చిహ్నాలు, స్థలాల మండలి (ఐకామోస్‌)కి  నివేదిక ఇవ్వాల్సి ఉందని, ఇదెంతో కీలకమని తెలిపింది. అందుకే ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ వ్యవహారం మొత్తాన్ని తామే స్వయంగా పర్యవేక్షణ చేస్తామని ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురావస్తు శాఖలు, రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారుల కమిటీకి కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ నోడల్‌ ఆఫీసర్‌గా ఉండాలని చెప్పింది. ఆగస్టు 4న కమిటీ సమావేశం అవ్వాలని, బ్లూ ప్రింట్‌ తయారు చేసి ఎప్పటికప్పుడు స్టేటస్‌ రిపోర్టులు అందజేయాలని, తొలి రిపోర్టు 4 వారాల్లోగా ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.