సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోండి.. భూదాన్‌ భూముల వివాదంలో ఐపీఎస్ ల అప్పీళ్లపై హైకోర్టు

సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోండి.. భూదాన్‌ భూముల వివాదంలో ఐపీఎస్  ల అప్పీళ్లపై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: భూదాన్​ భూములకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులపై సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోవాలని ఐపీఎస్ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్​ 181, 182, 194, 195లో భూదాన్​ భూములకు సంబంధించి పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణల నేపథ్యంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్‌ జడ్జి ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్​ చేస్తూ ఐపీఎస్‌లు రవి గుప్త, తరుణ్‌జోషి, బి.కె.రాహుల్‌ హెగ్డే, మహేశ్​ మురళీధర్‌ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రాతోపాటు జితేందర్‌ కుమార్‌ గోయల్‌ భార్య రేణుగోయల్, ఉమేశ్‌ షరాఫ్‌ భార్య రేఖ షరాఫ్‌, జనార్దన్‌రెడ్డి కుమారుడు రాహుల్‌ బుసిరెడ్డి, ప్రైవేటు వ్యక్తి వీరన్నగారి గౌతంరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా 4 అప్పీళ్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్, జస్టిస్‌ యారా రేణుకతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు ప్రకాశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎం.వి.సురేష్‌కుమార్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ అభ్యర్థనకు మించి సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని వారు అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారని తెలిపారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోరాదంటూ ఉత్తర్వులు ఇచ్చారని, ఇలాంటివి కేవలం ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనే ఇస్తారని తెలిపారు. ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని సింగిల్‌ జడ్జి వ్యక్తం చేశారని, ఇది అప్పీలుదారుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, కనీసం ఈ వ్యాఖ్యలను తొలగించాలని కోరారు. 

లేదంటే ప్రస్తుత ఉత్తర్వును రద్దుచేసి తాజాగా విచారణ చేపట్టాలంటూ సింగిల్‌ జడ్జి వద్దకు పంపేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వే నెం.194, 195 భూదాన్‌ భూములు కాదని తెలిపారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై మీడియాలో విపరీతంగా ప్రచారమైందని, అప్పీలుదారులు ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారని, వారి ప్రతిష్ఠకు మచ్చ కలిగించేలా ఉందని అన్నారు. ఈ ఉత్తర్వుల అమలును పక్కన అయినా పెట్టి ఊరటనివ్వాలన్నారు. వాదనలను విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు తుది తీర్పు కాదని, అందులో జోక్యం చేసుకోలేమంది. 

అప్పీలుదారులైన ఐపీఎస్, ఐఏఎస్‌లకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేశారంటున్నప్పుడు.. వాటిని తొలగించాలని కోరుతూ సింగిల్‌ జడ్జి వద్దే దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వుల సవరణ, రద్దు, మార్పులు ఏదైనా సింగిల్‌ జడ్జి మాత్రమే నిర్ణయం తీసుకోవాలంది. అప్పీలుదారులు మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని, దానిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీచేస్తారంటూ అప్పీలుపై విచారణను మూసివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.