
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ వివరాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెనూ ప్రకారం ఏ ఆహారం అందిస్తున్నారు? పోషకాహార ఆహారం అందిస్తున్నారా? ఒక్కొక్క విద్యార్థికి ఎంత మొత్తం కేటాయించారు? ఈ మొత్తాన్ని పెంచారా? వంటి వివరాలను తెలపాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలిచ్చింది. .విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన ఆహారం అందించడం లేదని కె. అఖిల్ శ్రీగురుతేజ వేసిన ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన బెంచ్..పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భాగ్యలక్ష్మి గుడి వద్ద బతుకమ్మ వేడుకలకు అనుమతి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి గుడి వద్ద ఈ నెల 23న బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులు విధించి ఉత్తర్వులు జారీ చేసింది. షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. 23వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5.30 వరకు మాత్రమే వేడుకలు నిర్వహించాలని, మహిళలు మాత్రమే పాల్గొనాలని ఆదేశించింది.
నేర చరిత్ర ఉన్నవారు పాల్గొనకూడదని, వీఐపీలను ఆహ్వానించకూడదని, అన్య మతాలను కించపరిచేలా ప్రసంగాలు, పాటలు పాడకూడదని, రాజకీయ ప్రసంగాలు చేయొద్దని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. శాంతి, భద్రతలకు విఘాతం కల్పించే చర్యలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు.