హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనపై అనర్హత వేటు వేసి అమర్‌నాథ్‌ను నియమించడాన్ని సవాల్ చేస్తూ మాజీ అధ్యక్షుడు ఎ. జగన్ మోహన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రేణుక యారా విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంబుడ్స్‌మెన్ పిటిషనర్‌పై అనర్హత వేటు వేయడంతోపాటు మరో వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు.
ఆరోపణలు రుజువుకాకుండానే అనర్హత వేటువేయడం సరికాదని చెప్పారు. హెచ్‌సీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇక్కడ పిటిషన్ విచారణార్హం కాదన్నారు. హెచ్‌సీఏ సొసైటీల చట్టం కింద నమోదైనందున ఏవైనా అభ్యంతరాలుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్ విచారణార్హతపై విచారణ చేపడతామంటూ 18కి వాయిదా వేశారు.
