అసెంబ్లీ బాగానే ఉందిగా..కొత్తదెందుకు?

అసెంబ్లీ  బాగానే ఉందిగా..కొత్తదెందుకు?
  • రాష్ట్ర ప్రభుత్వాన్నినిలదీసిన హైకోర్టు
  • ఎర్రమంజిల్​ కూల్చివేతకు హెచ్ఎండీఏ ఆమోదం ఉందా?
  • వాస్తవాలు చెప్పడానికి ఇంత జాప్యమెందుకు?
  • నేడు మళ్లీ విచారణ.. పూర్తి వివరాలు చెప్పాలని ఆదేశం

ఇప్పుడున్న అసెంబ్లీ భవనంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కొత్త బిల్డింగ్​ కట్టాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కొత్త అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్​ను కూల్చివేయాలని నిర్ణయించుకున్న సర్కారు.. దానిపై హైదరాబాద్​ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనుమతి తీసుకున్నదా అని ప్రశ్నించింది. అడిగిన వివరాలు వెల్లడించడానికి ఇంత జాప్యం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలను గురువారం నాటి విచారణలో వెల్లడించాలని స్పష్టం చేసింది.

కూల్చకుండా అడ్డుకోండి..

ఎర్రమంజిల్‌ భవనాలను 1870లో నవాబ్‌ సఫ్దర్‌జంగ్‌ ముషీరుద్దౌలా ఫక్రుల్‌ ముల్క్‌ నిర్మించారని, ఆ భవనం, స్థలంపై సివిల్‌ వివాదం కూడా ఉందని నవాబు వారసులు హైకోర్టులో పిటిషన్​ వేశారు. మరోవైపు హెరిటేజ్​ బిల్డింగ్​ అయిన ఎర్రమంజిల్​ను కూల్చి, కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న సర్కారు ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రొఫెసర్‌‌ విశ్వేశ్వర్‌‌రావు, జిందాబాద్‌‌ హైదరాబాద్‌‌ స్వచ్చంద సంస్థ, మరికొందరు పిల్స్‌‌ దాఖలు చేశారు. వీటిపై సీజే జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారణ జరిపింది. తొలుత సర్కారు తరఫున అదనపు ఏజీ రామచందర్​రావు వాదనలు వినిపించారు. వారసత్వ కట్టడాలకు సంబంధించిన హుడా నిబంధనలను ప్రభుత్వం 2015లోనే తొలగించిందని, ఒక చట్టాన్ని రద్దు చేసి మరో చట్టం చేసినప్పుడు పాత చట్టంలోని నిబంధనలు చెల్లుబాటు కావని చెప్పారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలకు అనేకసార్లు మరమ్మతులు జరిగాయని, వాహనాల పార్కింగ్‌‌కు యోగ్యంగా లేదని, అందుకే కొత్త భవనాన్ని కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇది విధాన నిర్ణయం కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని, రిట్లన్నింటినీ కొట్టేయాలని కోరారు.

పూర్తి వివరాలు చెప్పండి

ప్రభుత్వ వాదనలపై బెంచ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు? ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలున్నాయిగా? హుడా చట్టంలోని హెరిటేజ్‌‌ జాబితా నుంచి ఎర్రమంజిల్‌‌ను తొలగించినప్పుడు.. అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ చట్టంలో మార్పు చేయనప్పుడు.. ఆ భవనం కూల్చివేత కోసం హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవాలి కదా? హుడా స్థానంలో హెచ్ఎండీఏ వచ్చినప్పుడు అనుమతి తీసుకున్నారా? ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ కూల్చివేతకు అనుమతి ఉందో.. లేదో చెప్పడానికి మీనమేషాలు ఎందుకు? వాస్తవాలు చెప్పడానికి ఇంత జాప్యం ఎందుకు?”అని ప్రశ్నించింది. పూర్తి వివరాలను గురువారం కోర్టు చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది.