అసెంబ్లీ బిల్డింగ్​ పనికిరాదా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

అసెంబ్లీ బిల్డింగ్​ పనికిరాదా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
  • ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలా? అలా అని ఆర్​అండ్​బీ రిపోర్టు ఇచ్చిందా?
  • క్యాబినెట్​ తీర్మానం చేసిందా?  ఎజెండాలో ఏముందో చెప్పండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం 
  • కొత్త బిల్డింగ్​కు ప్లాన్​కూడా లేదా? 
  • కోర్టుకు వచ్చి డౌట్స్ ​క్లియర్  చేయాలని ఆర్​అండ్​బీ   చీఫ్​ ఇంజనీర్​కు ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగుఅసెంబ్లీ భవనం పనికిరాదని ఆర్ అండ్‌‌ బీ రిపోర్టు ఇచ్చిందా? ఆ రిపోర్టు ఆధారంగా క్యాబినెట్‌‌ మీటింగ్‌‌లో కొత్త అసెంబ్లీ నిర్మించాలని తీర్మానం చేసిండ్రా? అసలు క్యాబినెట్‌‌ ఎజెండాలో ఏముందో చెప్పండి? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని ఎప్పటి వరకు వాడుకోవచ్చు?  ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలని ఆర్ అండ్‌‌ బీ అధికారుల కమిటీ చెప్పిందా? వంటి సందేహాల్ని నివృత్తి చేయడానికి శుక్రవారం హైకోర్టుకు రావాలని రోడ్లు భవనాల శాఖ చీఫ్‌‌ ఇంజనీర్‌‌ను హైకోర్టు ఆదేశించింది. నూతన అసెంబ్లీ బిల్డింగ్‌‌ కాంప్లెక్స్‌‌కు కనీసం ప్లాన్‌‌ కూడా వేయలేదని ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు విస్మయాన్ని వెలిబుచ్చింది. ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ ప్లేస్‌‌లో అసెంబ్లీ బిల్డింగ్‌‌ కాంప్లెక్స్​ కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవ్వడమే కాకుండా చారిత్రక ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ కనమరుగవుతుందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్స్​ను గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది.

ప్లాన్‌‌ వేయడానికి ఆర్కిటెక్ట్, ఇంజినీర్లకు బాధ్యతలు ఇచ్చామని, హైదరాబాద్‌‌లోని వాళ్లే కాకుండా బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ఏరియాల్లోని ప్రముఖ ఆర్కెటెక్ట్​లకూ పనులు అప్పగించామని ప్రభుత్వ అడిషినల్‌‌ అడ్వకేట్‌‌జనరల్‌‌ రామచందర్‌‌రావు చెప్పారు. మూడు ఆర్కిటెక్ట్‌‌ సంస్థలు డిజైన్లు రూపొందిస్తున్నాయని, వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసి సుమారు 17 ఎకరాల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎర్రమంజిల్‌‌ భవనం ఉన్న ప్రాంతంలో స్థల విస్తీర్ణాన్నిబట్టి నూతన భవన నిర్మాణానికి డిజైన్‌‌ రూపొందిస్తామని ఆయన చెప్పారు. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్‌‌ లేకుండా హెచ్ఎండీఏ అనుమతి తీసుకోలేమన్నారు. విస్తీర్ణం చూసిన తర్వాత, ఆర్కిటెక్ట్స్​ నుంచి ప్లాన్‌‌ వచ్చాక, వాటిని ప్రభుత్వం ఆమోదించాక హెచ్ఎండీఏ నుంచి అనుమతి కోరుతామన్నారు.  ఇప్పుడు అసెంబ్లీ 119, కౌన్సిల్‌‌లో 40 మంది చొప్పున సభ్యులున్నారని, కార్ల పార్కింగ్‌‌కు జాగా లేదని, అసెంబ్లీ భవనం కూడా పెచ్చులూడుతుంటే ఎన్నో మార్లు రిపేర్లు చేయడం జరిగిందని తెలిపారు. భవనం పటిష్టంగా లేదని ఆర్ ఆండ్‌‌ బీ అధికారుల కమిటీ కూడా చెప్పిందన్నారు. చట్టసభ సభ్యుల సంఖ్య భవిష్యత్‌‌లో పెరుగుతుందని,  దానికి అనుగుణంగా సకల సౌకర్యాలతో కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్‌‌ నిర్మించాలన్నది సర్కార్‌‌ విధాన నిర్ణయమన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల మేరకు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదన్నారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.