చెరువుల కబ్జాలపై అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా? : హైకోర్టు

చెరువుల కబ్జాలపై  అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా? :  హైకోర్టు
  • కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్​గిరి జిల్లాల్లో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ పిటిషన్‌ దాఖలు చేయడానికి ముందు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు కదా అని బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. చట్టసభలో చర్చించే స్థాయిలోని వ్యక్తి నేరుగా హైకోర్టుకు రావడం ఎందుకని అడిగింది. అసెంబ్లీలో చర్చించి సమస్యను అక్కడే పరిష్కరించుకోవచ్చు కదాని సూచించింది. ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంది. పిటిషనర్‌ పేర్కొన్న చెరువుల ఆక్రమణల వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలకు నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. చెరువులు, నీటివనరులను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నాయని, దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు.