- హైడ్రాను నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఒక భూమి, స్థలం ప్రభుత్వానికి చెందినదని ఎలా నిర్ధారిస్తారని, దానికి ఏ ప్రాతిపదికన కంచె వేస్తారని హైడ్రాను మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదు అందితే చాలు ఎలాంటి ఆధారాలు లేకుండా కంచె వేస్తూ వెళతారా అంటూ నిలదీసింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని 1,351 చదరపు గజాల స్థలంలో ఒక షెడ్డును కూల్చివేసి కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త ప్రసాద్ ఎన్. తంజెర్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
జీవితకాలం పొదుపుతో కొనుగోలు చేసిన స్థలాలకు ప్రభుత్వ స్థలం, పార్కు స్థలం అంటూ కంచె వేస్తూ పోతే ఎలా అని ప్రశ్నించారు. కంచె వేయడానికి హైడ్రాకుఉన్న అధికారం ఏమిటో చెప్పాలన్నారు. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా పరిధి దాటి చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా కంచె వేయరాదని ఆదేశిస్తూ విచారణను మార్చి 3కు వాయిదా వేశారు.
