‘లోకల్’ పై ఇదేం తీరు?..ఒక్కోసారి ఒక్కో రూలా?..టీజీపీఎస్సీ తీరును తప్పుబట్టిన హైకోర్టు

‘లోకల్’ పై ఇదేం తీరు?..ఒక్కోసారి ఒక్కో రూలా?..టీజీపీఎస్సీ తీరును తప్పుబట్టిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ నియామకాల్లో స్థానికత నిర్ధారణకు టీజీపీఎస్సీ అనుసరిస్తున్న భిన్నపోకడలను హైకోర్టు తప్పుబట్టింది. ఒకసారి అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవలేదని,  మరోసారి 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణేతర ప్రాంతంలో చదివారనే కారణంతో తిరస్కరిస్తోందని, ఇది భిన్న పోకడల విధానమని వ్యాఖ్యానించింది. ఇలాంటి తీరును అనుమతించబోమని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2018లోని పేరా 7లోని నిబంధనలను విడివిడిగా కాకుండా కలిపి చదవాలంది.

నిబంధనలతోపాటు దానికున్న వ్యాఖ్యానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హితవు చెప్పింది. 2022 ఏఈఈ నోటిఫికేషన్​లో 1 నుంచి 7వ తరగతి వరకు ఏపీలో చదివారన్న కారణంగా స్థానికతను నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పి. నిశాంత్‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి పిటిషనర్‌‌‌‌‌‌‌‌ స్థానికుడిగా పరిగణనలోకి తీసుకోవాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ పి. శ్యాంకోశీ, జస్టిస్‌‌‌‌‌‌‌‌ నందికొండ నర్సింగరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది.

స్థానికతకు 1 నుంచి 7వ తరగతి వరకు చదివి ఉండాలన్న నిబంధనను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పోస్టుల నియామకాలకు దీనినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ టీజీపీఎస్సీ వాదనను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసించినవారిని ఇతర ప్రాంతంలో ప్రాథమిక విద్య అభ్యసించారంటూ తిరస్కరించడం సముచితం కాదంది.

స్థానికత నిర్ణయం పరిపాలనా సౌలభ్యం కోసం కాకుండా చట్టబద్ధ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని తేల్చి చెప్పింది. రకరకాల కారణాలతో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం వల్ల వారి కెరీర్​తో పాటు ప్రజావనరులు, కోర్టు సమయం వృథా అవుతుందని వ్యాఖ్యానించింది. పిటీషనర్‌‌‌‌‌‌‌‌ స్థానికత నిర్ధారణలో సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ టీజీపీఎస్సీ అప్పీలును కొట్టివేసింది.