హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ జారీ అయిన జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్‌ఎంసీ విభజన వల్ల జనగణనపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. జనాభా సేకరణ ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11న జారీ చేసిన జీవో 55ను సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన వ్యాపారి దారం గురవారెడ్డి పిటిషన్ వేశారు. దాన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల బెంచ్ గురువారం విచారించింది.
పిటిషనర్ న్యాయవాది, అడ్వకేట్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు స్పందిస్తూ.. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ తర్వాత మరో వారంలోగా పిటిషనర్ రిప్లయ్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.
