తాత సంరక్షణలో ఉన్న పిల్లలకు పాస్‌‌పోర్టు జారీ చేయండి : హైకోర్టు

తాత సంరక్షణలో ఉన్న పిల్లలకు పాస్‌‌పోర్టు జారీ చేయండి : హైకోర్టు
  • అధికారులకు హైకోర్టు ఆదేశం
  • పిల్లల ప్రయాణ హక్కును తండ్రి అడ్డుకోలేరని కామెంట్

హైదరాబాద్, వెలుగు: తల్లి చనిపోయిన పిల్లల బాగోగులు పట్టించుకోకుండా తండ్రిగా హక్కులున్నాయనడం సరికాదని హైకోర్టు పేర్కొన్నది. బాధ్యతలను విస్మరించి మైనర్ పిల్లల విదేశీ ప్రయాణ హక్కును అడ్డుకునే హక్కు తండ్రికి లేదని స్పష్టం చేసింది. తల్లి చనిపోయాక తాత, అమ్మమ్మ పరిరక్షణలో ఉన్న పిల్లలకు తండ్రి ఆమోదంతో సంబంధంలేకుండా పాస్‌‌పోర్టు జారీ చేయాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ సంరక్షణలో ఉన్న కూతురు పిల్లలకు తండ్రి అనుమతి లేకుండా పాస్‌‌పోర్టు జారీకి అధికారులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన మహమ్మద్‌‌ తాజుద్దీన్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌ నగేశ్‌‌ భీమపాక విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది దున్న అంబేడ్కర్‌‌ వాదనలు వినిపిస్తూ.. తాత, అమ్మమ్మ సంరక్షణలో ఉన్న పిల్లలు ఇద్దరికీ కోర్టు ఆదేశించినా నిర్వహణ ఖర్చులు చెల్లించడం లేదన్నారు. నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ.12 వేలు ఇవ్వాలంటూ కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే పిల్లల తండ్రి హైకోర్టును ఆశ్రయించి రెండో పెళ్లి చేసుకున్నందున కుటుంబ భారం ఉందంటూ దాన్ని రూ.8 వేలకు తగ్గించుకున్నారన్నారు. సంతకం చేయమని అడిగితే పిల్లల తల్లిపేరు మీద ఉన్న ఆస్తి, బంగారం ఇవ్వాలని డిమాండ్‌‌ చేస్తూ బ్లాక్‌‌మెయిల్‌‌ చేస్తున్నారని తెలిపారు. పిల్లల తండ్రి సయ్యద్‌‌ అహ్మద్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిల్లలను తనకు దూరం చేశారని, వారిపై హక్కు తనకే ఉందన్నారు. 

పిల్లలను చూసే అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు. వారి సంరక్షణ హక్కుల కోసం కింది కోర్టులో పిటిషన్‌‌ పెండింగ్‌‌లో ఉందని, అందువల్ల కోర్టు ఉత్తర్వులు జారీ అయ్యేదాకా పాస్‌‌పోర్టు జారీ చేయరాదన్నారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సంరక్షణ హక్కులు వివాదంలో ఉన్నప్పుడు కోర్టు ఉత్తర్వులు ఉండాలని, లేదంటే తండ్రి/తల్లి సంతకం అవసరమని నిబంధనలు చెప్తున్నాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అన్ని అంశాలను పరిశీలిస్తే తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు తాత, అమ్మమ్మ సంరక్షణలోనే ఉన్నారని, తండ్రిగా తన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించలేదన్నారు. అందువల్ల రాజ్యాంగం కల్పించిన ప్రయాణ హక్కును తండ్రిగా అడ్డుకోవడానికి వీల్లేదని తెలిపారు. తండ్రి ఆమోదం లేకపోయినా పాస్‌‌పోర్టును జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.