ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాకే విచారణ.. హైడ్రా కేసులో హైకోర్టు

ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాకే విచారణ.. హైడ్రా కేసులో హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైడ్రా ఫిర్యాదు మేరకు ఉద్యోగులపై దాఖలైన పలు కేసుల్లో.. వారికి నోటీసులు జారీ చేశాకే కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగులపై తాము తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సైబరాబాద్‌‌ ఆర్థిక నేరాల విభాగాన్ని ఆదేశించింది. భారతీయ నాగరిక్‌‌ సురక్షా సంహిత (బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌) సెక్షన్‌‌ 35(3) కింద (గతంలోని సీఆర్‌‌పీసీ 41ఏ) నోటీసులు జారీ చేయాలంది. నిందితులపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఏడేండ్లలోపు శిక్ష పడుతుందన్నారు. దీని ప్రకారం సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం 41ఏ నోటీసులిచ్చాకే దర్యాప్తు చేయాలని చెప్పింది. 

అలాగే, నిందితులైన అధికారుల వాదన వినాలని స్పష్టం చేసింది. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌లోని వివిధ ప్రాంతాల్లోని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినందుకు ఆరుగురు అధికారులపై ఆగస్టు 30న హైదరాబాద్‌‌ డిజాస్టర్‌‌ రెస్పాన్స్‌‌ అండ్‌‌ అసెట్‌‌ ప్రొటెక్షన్‌‌ అథారిటీ (హైడ్రా) కమిషనర్‌‌ ఏవీ రంగనాథ్‌‌ ఫిర్యాదు చేశారు. ఎరక్రుంట చెరువు విస్తీర్ణం 3.033 ఎకరాలు ఉండగా, తప్పుడు జియో కో-ఆర్డినేట్ల ఆధారంగా అనుమతులు మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆ అధికారులపై సైబరాబాద్‌‌ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి, ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ రికార్డు చేసింది. ఈ కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో మేడ్చల్‌‌ సర్వే అండ్‌‌ ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌ అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ కె.శ్రీనివాసులు, బాచుపల్లి తహసీల్దార్‌‌ పూల్‌‌సింగ్‌‌ పిటిషన్‌‌ వేశారు. ఈ పిటిషన్‌‌పై జస్టిస్‌‌ కె.సుజన విచారించారు. ఇరు పార్టీల తరఫున వాదనలు విన్న జస్టిస్.. క్రిమినల్‌‌ ప్రొసీడింగ్‌‌లపై స్టే ఇచ్చేందుకు, అభియోగాల రద్దుకు నిరాకరించారు. దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించారు.