- డీఎంఈ నరేంద్ర కుమార్కు టీఎస్ఆర్డీఏ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నెలకొన్న ఫ్యాకల్టీ కొరతను వెంటనే తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) ప్రభుత్వాన్ని కోరింది. కొత్త కాలేజీలు పెరుగుతున్నా.. అందులో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం కోఠిలోని డీఎంఈ ఆఫీసులో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ ను టీ-ఎస్ఆర్‌డీఏ బృందం కలిసి వినతిపత్రం అందజేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఖాళీలపై తాము నిర్వహించిన సర్వే వివరాలను ఈ సందర్భంగా డీఎంఈ ముందుంచింది. మెడికల్ కాలేజీల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా యాన్యువల్ జాబ్ క్యాలెండర్ ను వెంటనే ప్రకటించాలని, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పూర్తిచేయాలని, జిల్లాల్లో పనిచేసేవారికి స్పెషల్ అలవెన్స్ లు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
