మజ్లిస్‌‌‌‌ కోసమే గ్రేటర్‌‌‌‌ మూడు ముక్కలు..విభజనతో గ్రామాల్లోని పేదలకు అన్యాయం: కిషన్ రెడ్డి

మజ్లిస్‌‌‌‌ కోసమే గ్రేటర్‌‌‌‌ మూడు ముక్కలు..విభజనతో గ్రామాల్లోని పేదలకు అన్యాయం: కిషన్ రెడ్డి
  •     రాష్ట్రంలో ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ ట్యాక్స్‌‌‌‌ దందా.. ఆ డబ్బు కేరళ ఎలక్షన్‌‌‌‌కు మళ్లింపు 
  •     మున్సిపోల్స్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ అని కామెంట్ 
  •     మక్తల్‌‌‌‌ అభ్యర్థిది ఆత్మహత్య కాదు.. సర్కారు హత్యే: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమే గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా మూడు ముక్కలు చేసిందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్థిక వనరుల ప్రణాళిక లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఐఏఎస్​లను బదిలీ చేయడం, జీహెచ్ఎంసీని విభజిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్యే పోటీ ఉందన్నారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘మజ్లిస్ ఒత్తిడి మేరకే రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి ప్రాంతాలను కోర్ సిటీలో కలిపారు. దారుస్సలాం కనుసన్నల్లో పాలన సాగాలనే ఈ విభజన తెచ్చారు’’ అని ఆరోపించారు.

డిసెంబర్ 31, 2025 తర్వాత సరిహద్దులు మార్చరాదని,  అవసరమైతే 2027 మే వరకు ఆగాలని సెన్సస్ డైరెక్టరేట్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీతో పాటు నల్గొండ, గజ్వేల్ కార్పొరేషన్లనూ విభజించారన్నారు. ‘‘గతంలో జీహెచ్ఎంసీ 650 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండగా, ఇప్పుడు 2,053 చ.కి.మీ.కు పెంచారు. ఎయిర్‌‌‌‌పోర్ట్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ వంటి ప్రాంతాలను పక్కనబెట్టి.. పేదలు ఉండే గ్రామాలను కార్పొరేషన్‌‌‌‌లో కలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఉపాధి హామీ వంటి పథకాలకు దూరమవుతారు”అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చట్టవ్యతిరేక నిర్ణయమని, దీనిపై పోరాటం 
చేస్తామన్నారు. 

విడగొట్టి ఏం సాధిస్తారు?  

జీహెచ్ఎంసీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉందని, నిధులు లేకుండా మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి ఏం సాధిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 'ఆర్-ఆర్' ట్యాక్స్ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయని, ఎన్‌‌‌‌వోసీలు, ల్యాండ్ పర్మిషన్ల పేరుతో దండుకున్న డబ్బును కేరళ ఎన్నికల కోసం మళ్లించారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, ఒత్తిళ్ల వల్లే మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోందని, పోలింగ్ బూత్‌‌‌‌ల వద్ద పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచినా అధికారులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన బాధ్యత రాష్ట్ర సర్కారుపైనే ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వస్తాయని, కానీ సీఎం రేవంత్ అడిగినట్టు రూ. లక్షన్నర కోట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ను అరెస్టు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై నెపం నెట్టడం సరికాదన్నారు.  

ఓటమి భయంతోనే కాంగ్రెస్‌‌‌‌ అరాచకాలు:రాంచందర్ రావు 

మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. గతంలో ఇందిరా గాంధీ అధికార దుర్వినియోగానికి పాల్పడితే కోర్టు అనర్హత వేటు వేసిందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, అధికార బలంతో గెలవాలని కాంగ్రెస్ చూసిందని.. అయినా ఓటర్లు బీజేపీవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తమ రాజకీయ స్వార్థం కోసం, మజ్లిస్ పార్టీకి మేలు చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని తాకట్టు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌‌‌‌ను మజ్లిస్‌‌‌‌కు అప్పగించేలా.. దారుస్సలాం కేంద్రంగా ఉండేలా ఒక కార్పొరేషన్‌‌‌‌ను డిజైన్ చేశారన్నారు. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటన కాంగ్రెస్ చేసిన హత్యేనని ఆరోపించారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో బీజేపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ వీరేందర్ గౌడ్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిఎన్వీ సుభాష్, రాష్ట్ర నేతలు రవి నాయక్, జి.వెంకట్ రెడ్డి, సునీత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.