రాయదుర్గంలో అత్యంత విలువైన 5 ఎకరాల భూమి వేలంపై హైకోర్టు స్టే..  

రాయదుర్గంలో  అత్యంత విలువైన 5 ఎకరాల భూమి వేలంపై హైకోర్టు స్టే..  
  •     భూకేటాయింపు లక్ష్యం, ప్రజాప్రయోజనంపై వాదనలు
  •     కొన్న వ్యక్తి స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టినా పర్వాలేదనడంపై ఆసక్తికర చర్చ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ నాలెడ్జ్‌‌ సిటీలోని అత్యంత విలువైన ఐదు ఎకరాల భూమి వేలానికి సంబంధించి హైకోర్టు  మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నెం.83/1లోని ఐదు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇండస్ట్రియల్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్‌‌ (టీజీఐఐసీ) గత మే 28న ఈ–వేలం ద్వారా విక్రయించగా, ఆ భూమిపై తమకు హక్కులు కొనసాగుతున్నాయని స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌బీఐ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌ కుమార్‌‌ గురువారం మూడు గంటలకుపైగా విచారణ జరిపి, వేలం నోటిఫికేషన్, దాని ఆధారంగా జరిగిన విక్రయానికి సంబంధించిన తదుపరి అన్ని చర్యల అమలును నిలిపివేస్తూ మూడు వారాలపాటు మధ్యంతర స్టే ఉత్తర్వులను జారీ చేశారు.

కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్టే 

ఈ భూమిని 2010లో అప్పటి స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ హైదరాబాద్‌‌ (ఎస్‌‌బీహెచ్‌‌)కు బ్యాంకింగ్‌‌ కార్యాలయ సముదాయం నిర్మాణం కోసం కేటాయించారు. ఇందుకోసం రూ.13.33 కోట్ల మొత్తం చెల్లించి 2011 జనవరిలో భూమి స్వాధీనం కూడా పొందినట్లు ఎస్‌‌బీఐ తెలిపింది. 2017లో ఎస్‌‌బీహెచ్‌‌ ఎస్‌‌బీఐలో విలీనమైన తరువాత ఇక్కడ అడ్వాన్స్‌‌డ్‌‌ క్యాపబిలిటీ అండ్‌‌ ఇన్నోవేషన్‌‌ సెంటర్‌‌ (ఏసీఐసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ముంబై తర్వాత దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని భావించామని తెలిపింది. ఎస్‌‌బీఐ తరఫున సీనియర్‌‌ న్యాయవాది బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదనలు వినిపిస్తూ, ఏపీ విభజన, వివిధ అనుమతుల జాప్యం, ఎస్‌‌బీహెచ్‌‌–ఎస్‌‌బీఐ విలీనం, ప్రాజెక్టు మేనేజ్‌‌మెంట్‌‌ కన్సల్టెంట్‌‌గా వ్యవహరించిన బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ ఆర్థిక ఇబ్బందులు, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు.

అయినప్పటికీ విమానాశ్రయ, అగ్నిమాపక, పర్యావరణ, జీహెచ్‌‌ఎంసీ నిర్మాణ అనుమతులు పొందామని, ట్విన్‌‌ టవర్ల నిర్మాణానికి అవసరమైన తవ్వకాలు పూర్తి చేశామని తెలిపారు. స్థలంలో బ్యాంకు శాఖ, ఏటీఎంలు ఏర్పాటు చేయడంతో పాటు అభివద్ధి పనులపై సుమారు రూ.21.5 కోట్లు ఖర్చు చేసినట్లు కోర్టుకు వివరించారు. భూమి కేటాయింపును 2021లో ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, ఆ నిర్ణయాన్ని హైకోర్టు గతంలో రద్దు చేసి తిరిగి పరిశీలించాలని ఆదేశించిందని తెలిపారు. అనంతరం కూడా ఇదే అంశంపై జరిగిన విచారణల్లో హైకోర్టు, డివిజన్‌‌ బెంచ్‌‌ రెండూ ఎస్‌‌బీఐ అభ్యర్థనను పునఃపరిశీలించాలని ఆదేశించాయని గుర్తు చేశారు. అయితే ఎస్‌‌బీఐ సమయ పొడిగింపు అభ్యర్థన పెండింగ్‌‌లో ఉండగానే మే 6న భూమి వేలం నోటిఫికేషన్‌‌ జారీ చేశారని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని వాదించారు.

మానిటైజ్​ చేయడమే ప్రజాప్రయోజనమా?

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌ జనరల్‌‌ టి. రజనీకాంత్‌‌ రెడ్డి వాదిస్తూ, రూ.13 కోట్ల  అత్యల్ప ధరకు భూమిని కేటాయించినప్పటికీ గత 16 ఏళ్లలో ఎస్‌‌బీఐ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో నిర్మాణం ప్రారంభించి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. నిర్మాణం జరగలేదని తెలిపారు. భూమిని కేటాయించిన లక్ష్యానికి వినియోగించకపోతే ప్రభుత్వం రద్దు చేసే అధికారం కలిగి ఉందని వాదించారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పారదర్శక ఈ–వేలం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థలంలో మూడు ఏటీఎంలు, ప్రహరీ గోడ తప్ప పెద్దగా నిర్మాణం జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నారు. వేలంలో భూమిని ఎకరా రూ.237 కోట్ల చొప్పున గౌరా వెంచర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ వశం చేసుకుంది. టీజీఐఐసీ తరఫున సీనియర్‌‌ న్యాయవాది ఎస్‌‌. నిరంజన్‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎస్‌‌బీఐ ఎన్నో సంవత్సరాలుగా భూమిని ఆక్రమించుకుని ఉందన్నారు.

అంతే తప్ప ప్రాజెక్టు అమలు చేయలేదన్నారు. ఆలస్యానికి చూపుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు. వేలం పూర్తయిన తరువాత కొనుగోలుదారుడు ఆ స్థలాన్ని తనకు నచ్చిన విధంగా వినియోగించుకునే హక్కు ఉంటుందని, అవసరమైతే ఫామ్‌‌హౌస్‌‌ లేదా స్విమ్మింగ్‌‌పూల్‌‌ కూడా నిర్మించవచ్చని వాదించారు. ప్రజాప్రయోజనం అనేది కొనుగోలుదారుడు ఏ నిర్మాణం చేస్తాడన్నదిలో కాకుండా, ప్రభుత్వం వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంలో ఉందని తెలిపారు. ఈ వాదనపై ఎస్‌‌బీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌‌ ఎన్‌‌. వెంకటరామన్‌‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫామ్‌‌హౌస్‌‌ లేదా స్విమ్మింగ్‌‌పూల్‌‌ నిర్మాణం కూడా ప్రజాప్రయోజనమేనని చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. భూమిని మానిటైజ్‌‌ చేయడమే ప్రజాప్రయోజనానికి ప్రత్యామ్నాయం కాదన్నారు. ఐకియా వంటి ఇతర సంస్థలకు ప్రభుత్వం సమయ పొడిగింపులు ఇచ్చినా, ఎస్‌‌బీఐకి మాత్రం అదే అవకాశం నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 14కు విరుద్ధమని వాదించారు.

మూడు వారాలు స్టే 

విచారణలో భాగంగా జస్టిస్‌‌ శ్రవణ్‌‌ కుమార్‌‌ ఎస్‌‌బీఐని ప్రశ్నిస్తూ, నిజంగా నిర్మాణం చేపట్టే ఉద్దేశం ఉందా? ఉంటే ఎంత కాలంలో పూర్తి చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన అదనపు సొలిసిటర్‌‌ జనరల్, రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయడానికి బ్యాంకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించారు. ఈ వేలం ద్వారా సాధించాల్సిన ప్రజాప్రయోజనం ఏమిటో కోర్టును సంతృప్తిపరచాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం, మే 6న జారీ చేసిన వేలం నోటిఫికేషన్‌‌తో పాటు దాని ఆధారంగా జరిగిన విక్రయానికి సంబంధించిన తదుపరి అన్ని చర్యలపై మూడు వారాలపాటు స్టే విధిస్తూ జస్టిస్‌‌ ఎన్‌‌.వి. శ్రవణ్‌‌ కుమార్‌‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులు కౌంటర్‌‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌‌ ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.