- నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పెద్ద చెరువులో తవ్వకాలు
- మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశం
- ప్రభుత్వానికి, అధికారులకు నోటీసులు జారీ
హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పెద్దచెరువు నుంచి ఇటుకల తయారీ కోసం ప్రైవేటు వ్యక్తులు మట్టి తరలించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై స్టే విధిస్తూ జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చెరువు నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల మట్టిని తరలించేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ చింతపల్లికి చెందిన నట్వా గిరిధర్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ నిబంధనలకు, ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవోకు విరుద్ధంగా అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. సాధారణంగా చెరువు మట్టిని రిజర్వాయర్ల నిర్మాణానికి లేదా మైనింగ్ నిబంధనల ప్రకారం వినియోగించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఇటుకల తయారీకి అనుమతించడం చట్టవిరుద్ధమని తెలిపారు.
ఈ అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు ఏప్రిల్ 27న అధికారులకు వినతి పత్రం సమర్పించినా చర్యలు తీసుకోవడంలేదన్నారు. 10 వేల మెట్రిక్ టన్నుల ఉపరితల మట్టి తరలింపునకు ప్రైవేటు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి మట్టి తరలింపునకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతించరాదంటూ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రాష్ట్ర గనుల శాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, రెవెన్యూశాఖ, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులైన విజయేందర్‌రెడ్డి, వై.కోటేశ్వరరావులకు నోటీసులు జారీ చేశారు. మట్టి తరలింపుపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 1వ తేదీకి వాయదా వేశారు.
