- నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించిందన్న బాధితులు
- త్వరగా న్యాయం చేయాలని వేడుకోలు
బషీర్‌బాగ్, వెలుగు: ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేయాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని ధన్వంతరి బాధితులు తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు. ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో కమలాకర శర్మ అధిక లాభాలు ఆశ చూపి సుమారు 2 వేల మంది నుంచి రూ.220 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.
2023లో సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా, నాంపల్లి కోర్టు ఆస్తుల జప్తుకు ఆదేశించిందన్నారు. అయితే, కమలాకర శర్మ స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయగా, సీసీఎస్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో హైకోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించిందని తెలిపారు. ఇప్పటికైనా త్వరగా జ్యుడీషియల్ కమిటీ వేసి ధన్వంతి ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
