ఆ భూములు ప్రభుత్వానివే

ఆ భూములు ప్రభుత్వానివే
  • 11 ఏండ్ల తర్వాత హైకోర్టు కీలక తీర్పు 
  • సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ సమీపంలోని గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలోని దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన 142.39 ఎకరాలు ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు తీర్పు చెప్పింది. అసైన్డ్ భూమిని అసైనీలు రూల్స్ కు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం తప్పని, దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం కరెక్టేనని చెప్పింది. అసైన్డ్ భూములపై అసైనీలకు కూడా హక్కులు ఉంటాయని, వారికి పరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని 2010లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ శుక్రవారం చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీల డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో 11 ఏండ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు వచ్చింది.  

2007లో గ్రేహౌండ్స్ కు కేటాయింపు.. 
గ్రామంలోని సర్వే నంబర్‌‌ 391/1 నుంచి 391/20 వరకు ఉన్న 142.39 ఎకరాల అసైన్డ్ భూమిని 1961లో అప్పటి ప్రభుత్వం 20 మందికి కేటాయించింది. ఈ భూములను సాగుకు మాత్రమే కేటాయిస్తున్నామని, అమ్మడం కుదరదని షరతు పెట్టింది. అయితే ఆ 20 మంది తమ భూములను ఎంఏ భక్షి అనే వ్యక్తికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) ఇచ్చారు. అతను దాన్ని 71 ప్లాట్లుగా విభజించి, రిజిస్ట్రేషన్లు చేశాడు. దీంతో సర్కార్ ఆ భూమిని 2007లో స్వాధీనం చేసుకొని,  గ్రేహౌండ్స్ బలగాలకు కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ 45 మంది కోర్టుకు వెళ్లారు. దీంతో అసైనీలకు పరిహారం చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో తీర్పు ఇచ్చారు. దానిపై సర్కార్ హైకోర్టులో అప్పీల్ చేసింది. ‘‘అసైనీలు రూల్స్ ఉల్లంఘించి భూమిని జీపీఏ ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడం తదితర అంశాలను సింగిల్ జడ్జి విస్మరించారు. అందుకే ఆ తీర్పును రద్దు చేస్తున్నాం. ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజోపయోగ పనులకు వాడుకుంటోంది. ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం కాకుండా కాపాడిన అధికారులకు అభినందనలు” అని హైకోర్టు పేర్కొంది.