V6 News

సింగరేణి యూనియన్ ఎన్నికలపై.. హైకోర్టు తీర్పు రిజర్వ్

సింగరేణి యూనియన్ ఎన్నికలపై.. హైకోర్టు తీర్పు రిజర్వ్
  •    గడువు కోరిన అడిషనల్ ఏజీ
  •    ఇవ్వొద్దన్న సింగరేణి కోల్‌‌మైన్‌‌ వర్కర్స్‌‌ యూనియన్

హైదరాబాద్, వెలుగు: వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ అధికారులతో నిర్వహించే సమావేశాలు నేపథ్యంలో సింగరేణి యూనియన్ ఎలక్షన్లు వాయిదా వేయాలన్న పిటిషన్​పై ఇరుపక్షాల వాదనలు శుక్రవారం ముగిశాయి. ఈమేరకు తీర్పు రిజర్వ్​లో పెట్టినట్లు జస్టిస్ విజయ్​సేన్ రెడ్డి తెలిపారు. హైకోర్టు గత ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది అక్టోబర్​లోగా సింగరేణి యూనియన్ ఎన్నికలు నిర్వహించలేమని, వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయాలని సింగరేణి మేనేజ్​మెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Also Read :- రియ‌‌‌‌‌‌‌‌ల్ కంపెనీల‌‌‌‌‌‌‌‌పై రెరా చర్యలు

దీనిపై పిటిషన్ తరఫు అదనపు ఏజీ రామచందర్ రావు వాదనలు వినిపించారు. వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు గడువు కావాలని కోరారు. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కోర్టుకు వివరించారు. ఇబ్బందుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణను వాయిదాకు అనుమతిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. 

నాలుగేండ్లుగా పట్టించుకోవట్లే..

తొలుత సింగరేణి కోల్‌‌మైన్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌ తరఫు సీనియర్‌‌ అడ్వకేట్ జి.విద్యాసాగర్‌‌ వాదనలు వినిపిస్తూ.. ఏదో ఒక సాకు చూపించి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. వరుసగా పండుగలు, తర్వాత ఎన్నికల నిర్వహణ సమావేశాలు, ఆ తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్‌‌ ఎన్నికల సమావేశాల కారణాలతో ప్రభుత్వం వాయిదాలు కోరుతున్నదన్నారు. 2019లోనే గుర్తింపు సంఘం గడువు ముగిసిందన్నారు. 4 ఏండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వాయిదాలు వేసిందని తెలిపారు. 11 జిల్లాల పరిధిలో దాదాపు 42 వేల మంది కార్మికులున్న సింగరేణికి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.