
- రూల్స్ పాటించని బిల్డర్లకు రూ. 17.50 కోట్ల ఫైన్
హైదరాబాద్, వెలుగు : రియల్ ఎస్టేట్ రెగ్యులరటరీ అథారిటీ(రెరా) రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రచారంతో పాటు మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న పలు రియల్ కంపెనీలకు టీఎస్ రెరా గట్టి షాక్ ఇచ్చింది. ఇద్దరు బిల్డర్లు, ఒక రియల్టర్‌పై సుమారు రూ.17.50 కోట్ల జరిమానా విధించింది. సాహితీ గ్రూప్ సంస్థ పర్మిషన్ లేకుండా ఫ్లాట్లను అమ్మినట్లు గుర్తించిన రెరా ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయినా సాహితీ గ్రూప్ స్పందించలేదు. దీంతో నిబంధనల్ని ఉల్లంఘించి పలు ప్రాజెక్టుల్ని చేపట్టిన సాహితీ సంస్థపై రెరా రూ. 10.74 కోట్ల ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని15 రోజుల్లోపు చెల్లించాలని.. లేకుంటే 59 (2) సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాగా..మరో సంస్థ మంత్రి డెవలపర్స్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో ఓ ప్రాజెక్టు చేపట్టింది. అయితే, ఫారం – ‘బి’లో తప్పుడు సమాచారాన్ని పొందుపర్చడమే కాకుండా వార్షిక, త్రైమాసిక నివేదికలు సమర్పించలేదు. దాంతో సెక్షను 60, 61 ప్రకారం..మంత్రి డెవలపర్స్‌కు టీఎస్ రెరా రూ.6.50 కోట్ల జరిమానా విధించింది. ఫైన్ చెల్లించకపోతే సెక్షను 63 ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
సాయి సూర్య డెవలపర్స్ సంస్థ కూడా నిబంధనలు ఉల్లంఘించడంతో రూ. 25 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ రెరా ఆదేశాల్ని బేఖాతరు చేస్తే సుమారు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తారు. ప్రాజెక్టు మొత్తం విలువలో పది శాతం జరిమానా కూడా విధిస్తారు.