కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక అపచారాలు పరాకాష్టకు చేరుకున్నాయని.. 300 రూపాయల టికెట్‌ను 3 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారంటూ మండిపడ్డారాయన.
2026, ఏప్రిల్ 20వ తేదీన.. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలను ప్రక్షాళన చేస్తాం అని చెప్పే కూటమి నేతలు.. అడ్డూ అదుపు లేకుండా అపచారాలు చేస్తున్నారని దైవసాక్షిగా చెబుతున్నానంటూ విరుచుకుపడ్డారాయన. 2008లో నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్న సమయంలో బాల మురళి కృష్ణను ఆస్థాన విద్వాంసుడిగా నియమించాం అని.. ఆయన చేత ఆలయం ఎదుట సంగీత కార్యక్రమం నిర్వహించాఅని.. ఇది శాశ్వతంగా ఉండాలని నాదనీరాజన ప్రాంగణం వెలసిందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. ఆ వేదికలో సాంస్కృతిక వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసేలా కార్యక్రమం జరుగుతూ వచ్చాయని.. ప్రస్తుతం ఆ వేదికపై అవినీతి కంపు కొడుతోందంటూ విమర్శలు చేశారాయన దీని కోసం భాస్కర్ అనే అధికారిని నియమించారని.. ఆయనకు అర్హత లేదని.. సీఎం, చైర్మన్ అండదండలతో భాస్కర్ పేట్రేగి పోతున్నారంటూ ఆరోపించారాయన.
►ALSO READ | సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా.. వడదెబ్బకి కుప్పకూలిన NSG కమాండో !
ప్రోగ్రాం ఇచ్చేందుకే కమీషన్లు ఇవ్వాలి.. పారితోషికంలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని టీటీడీలో అవినీతిపై ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి. వీఐపీ, బ్రేక్, 300 రూపాయల దర్శనం టికెట్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని.. 300 టికెట్లను 3 వేల రూపాయలకు అమ్మేస్తున్నారు.. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారంటూ ఆరోపించారాయన. శ్రీవాణి టికెట్లను 15 వేలకు అమ్మేస్తున్నారని.. ఎస్వీబీసీ ఛానెల్ లో అనర్హులకు పదవి ఇచ్చి నాశనం చేశారంటూ విరుచుకుపడ్డారాయన.
రూ.50 కోట్లతో ఎస్వీబీసీ ఛానెల్ స్వయం ప్రతిపత్తి సంస్థగా తీర్చి దిద్దే ప్రయత్నం జగన్ హయాంలో జరిగిందని.. కరోనా సమయంలో ఎస్వీబీసీ ద్వారా ప్రేరణ పొందేలా చేశామని వివరించారాయన. కూటమి ప్రభుత్వం కుప్ప విశ్వనాథ శర్మను ఎస్వీబీసీ నుంచి పంపేశారని.. చతుర్వేద యాగాలు పూర్తిగా నిలిపివేశారని.. 700 మంది వేద పారాయణదారుల నియామకం ఇంకా జరగలేదన్నారాయన. కన్వీనర్ కోట్ల రూపాయలు అభ్యర్థుల దగ్గర నుంచి కాజేసినా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారాయన.
నృత్య, సంగీత కళాశాలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోందని.. అర్హత లేని వ్యక్తిని హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కు నియమించారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై విమర్శలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ఆన్‌లైన్ పెట్టిన అనంతరం 800 టికెట్లు ఎలా పూర్తి అవుతాయని.. ఒక్కో టికెట్ కొట్టడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా అంటూ నిలదీశారాయన.
కొండపై బ్రోకర్లు ఉన్నారని.. రూ.15 వేలకు బ్లాక్ లో టికెట్లను అమ్మేస్తున్నారని.. 400 నుంచి 600 శ్రీవాణి టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారంటూ విమర్శలు చేశారాయన. రోజుకు శ్రీవాణి టికెట్ల ముసుగులో 15 లక్షలకు పైగా అవినీతికి పాల్పడుతున్నారు అంటూ ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన చేసిన ఆరోపణలు, విమర్శలపై టీడీపీ చైర్మన్, ఇతర పాలక మండలి సభ్యులు, టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

