V6 News

తుది తీర్పునకు లోబడే అడ్మిషన్లు.. ఒవైసీ విద్యాసంస్థల అడ్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

తుది తీర్పునకు  లోబడే అడ్మిషన్లు.. ఒవైసీ విద్యాసంస్థల అడ్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ పరిధిలోని సల్కం చెరువును ఆక్రమించి నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓవైసీ ఎడ్యుకేషనల్‌‌ క్యాంపస్‌‌లో 2026-–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌‌ ఎన్‌‌వీ శ్రవణ్‌‌కుమార్‌‌ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

సల్కం చెరువు ఆక్రమణలపై విజయగోపాల్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన కోర్టు.. నగరంలోని ఇతర చెరువులకు ఎఫ్‌‌టీఎల్‌‌ ఖరారు చేసినప్పటికీ, ఈ చెరువుకు మాత్రం తుది నోటిఫికేషన్‌‌ ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శాటిలైట్‌‌ చిత్రాల ఆధారంగా అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. 

రెవెన్యూ, ఇరిగేషన్‌‌ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, వివాదాస్పద స్థలంలో అడ్మిషన్లు పొందడం అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. భవిష్యత్​లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారు ఎలాంటి హక్కులను పొందలేరని న్యాయమూర్తి స్పష్టం చేశారు.