చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టురట్టు కాగా, అందులో ఓ నిందితుడు భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. సీఐ భూపాల్ శ్రీధర్ వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన అనిల్ దుబే తన భార్య అమృత పేరుతో 2006లో చేవెళ్లలో 300 గజాల ప్లాటు కొనుగోలు చేశారు. ఈ భూమిపై నగరానికి చెందిన తయ్యబ్ ఉద్దీన్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడు.
ఈ ప్లాటును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సోమవారం ఒక మహిళను అసలు యజమాని అమృతగా నమ్మిస్తూ చేవెళ్ల కార్యాలయానికి తీసుకువచ్చాడు. పత్రాలను పరిశీలిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సదరు మహిళను ప్రశ్నించగా, ఆమె సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో భయం పట్టుకున్న నిందితుడు తయ్యబ్ ఉద్దీన్ కార్యాలయం రెండో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

