
- నిరసనగా రాజాసింగ్రాజీనామా..నామినేషన్ వేయకుండా అడ్డుకున్నరని ఫైర్
- రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదని కామెంట్
- హైకమాండ్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు: బండి సంజయ్
- చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని పెట్టే పార్టీ తమది కాదని వ్యాఖ్య
- నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాని ఈటల, అర్వింద్
- బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ మంగళవారం రాంచందర్ రావు పేరును అధికారికంగా ప్రకటించనున్నది. కాగా, స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక సందర్భంగా బీజేపీలో రోజంతా హైడ్రామా నడిచింది. నామినేషన్ వేయనీయకుండా తనకు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే కేంద్ర మంత్రి, బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అందజేశారు. ఈ రాజీనామాతో పార్టీలో కలకలం రేగింది. కాగా, రాంచందర్‌రావు ఎన్నిక పట్ల తార్నాకలోని ఆయన ఇంటి వద్ద అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు బీసీలకే బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని మొదటి నుంచి వార్తలు రాగా, చివరి నిమిషంలో దక్కకపోవడంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దీనికితోడు మొదటి నుంచి బీజేపీ అధ్యక్ష రేసులో పేర్లు వినిపించిన ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తదితరులు స్టేట్ ఆఫీసు వైపు రాలేదు. హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుపడ్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో సొంత పార్టీ శ్రేణులకు బండి సంజయ్ వార్నింగ్ఇచ్చారు. హైకమాండ్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పార్టీలో అసలు ఏమి జరుగుతుందో తెలియక ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
ఒకే ఒక్క నామినేషన్..
బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరంద్లాజే మంగళవారం నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకూ నామినేషన్లు తీసుకున్నారు. హైకమాండ్ ఆదేశాలతో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు ఒక్కరు మాత్రమే ప్రెసిడెంట్ పోస్టుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా నామినేషన్ వేసేందుకు బీజేపీ ఆఫీస్‌కు వచ్చారు. ఎన్నికల ఇన్చార్జి శోభ కరంద్లాజే నుంచి నామినేషన్ పత్రం తీసుకున్నారు.
ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు షాక్ అయ్యారు. కాగా, నామినేషన్ వేయాలంటే ఓటింగ్‌కు అర్హులైన పది మంది సంతకాలు అవసరమనే నిబంధన ఉంది. కానీ, తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చే నేతలను బీజేపీ నాయకులు బెదిరించి, రాకుండా చేశారని రాజాసింగ్ ఆరోపించారు. రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో రాంచందర్ రావు ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఉదయం10 గంటలకు మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నిక, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర , జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు.
ఏబీవీపీ నుంచి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దాకా..
బీజేపీ సీనియర్ నేత రాంచందర్ రావు న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా అందరికీ పరిచయం. 1959లో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పనిచేశారు. ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీ లీగల్ సెల్ తదితర విభాగాల్లో సేవలందించారు. 1977 నుంచి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏండ్లపాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఓయూలో ఏబీవీపీలో పనిచేస్తూనే, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, బీజేవైఎం సిటీ వైస్ ప్రెసిడెంట్‌గా, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్‌గా, నేషనల్ జాయింట్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఉమ్మడి ఏపీలో బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, చీఫ్ స్పోక్స్ పర్సన్‌గా పనిచేశారు. 2015లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2013–15 వరకుజాతీయ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగానూ రాంచందర్‌రావు సేవలందించారు. కాగా, బీజేపీలో రాంచందర్ రావు అజాతశత్రువుగా, అందరినీ కలుపుకొని పోతారనే పేరున్నది.