
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈనెల 24న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్బహిరంగ సభ అనుమతిపై బుధవారం హైడ్రామా నడిచింది. ఔరంగాబాద్‌లోని అంఖాస్ మైదానంలో 24న నిర్వహించే బీఆర్ఎస్బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వాలని స్థానిక నాయకులు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం 24న సభ నిర్వహించి తీరాల్సిందేనని, ఇంకో గ్రౌండ్ చూసి పర్మిషన్ కోసం ప్రయత్నించాలని నాయకులను ఆదేశించారు.
ఔరంగాబాద్‌లోని జంబిదా మైదానంలో సభ నిర్వహించుకుంటామని, అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు తిరిగి అప్లయ్ చేసుకున్నారు. అక్కడ సభ నిర్వహణకు పోలీసులు ఓకే చెప్పడంతో .. సభా వేదిక, ఇతర ఏర్పాట్లకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భూమి పూజ చేశారు.