- దీన్ని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తా
- బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థలో జరిగిన భారీ అక్రమాలను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు అక్రమాలు, రూ. 1,600 కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిన ఈ అంశంపై వాస్తవాలను బయటపెట్టాలని కోరారు.
ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కిష్టారం సమీపంలోని సైలో బంకర్ నిర్మాణం, కొత్తగూడెం సింగరేణి క్వార్టర్ల నిర్మాణం, గనుల కేటాయింపుల్లో నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపించారు. సింగరేణి సీఎస్‌ఆర్, డీఎంఎఫ్ నిధుల వినియోగంపై అనుమానాలు ఉన్నాయని.. గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులు ఎటు మళ్లాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర సంపదతో కొందరు వ్యక్తులు చెలగాటం ఆడుతున్నారని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో తేలాలన్నారు. సింగరేణి అక్రమాల వ్యవహారాన్ని తాను వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరనున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని, ప్రజా సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి, పారదర్శకతను నిరూపించుకోవాలని కోరారు.
