ఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్

ఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్

ఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకొని అక్కడ తిష్టవేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం ఈడీ కవితను అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేసేందుకే భారీ గా తరలివెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలెర్టయ్యారు. ఇటు తుగ్లక్ రోడ్డు లోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద కూడా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా పబ్లిక్ ఉంటే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

ర్యాలీలు, ధర్నాలకు నో 

 ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఈడీ ఆఫీస్ పరిసరాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ కవితను విచారించనున్న నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వైపునకు ఎవరూ రావొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మైకుల్లోనూ పోలీసులు అనౌన్స్ మెంట్ చేశారు.