కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, అరోరా కాలేజీ భూములు, శిశు మందిర్ పాఠశాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో చర్చకు సిద్దమంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు ఆఫీసు దగ్గరికి చేరుకున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు.
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మహేందర్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ అంటేలా కార్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు బీజేపీ కార్యకర్తలు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇరువర్గాలను అడ్డుకొని..చెదరగొట్టారు పోలీసులు.
ఏం జరిగిందంటే:
కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు తీసుకొని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని, తాను స్వయంగా వస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు, కాలేజీ భూముల నుంచి స్థలాలు పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు వస్తారన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకునేందుకు సాక్ష్యాలతో రావాలని కోరారు.
డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో పార్టీల మధ్య విమర్శల వేడి రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీనాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నారు. ఇరు పార్టీల నాయకులు రానున్నట్లు పేర్కొన్న క్రమంలో ఉత్కంఠ నెలకొంది.
