ఉన్నత చదువులంటే.. బయటికి వెళ్లాల్సిందే..

ఉన్నత చదువులంటే.. బయటికి వెళ్లాల్సిందే..

నారాయణపేటలో అందుబాటులో లేని పీజీ కాలేజీలు

గాలిలో కలిసిన  పీజీ సెంటర్​ హామీ!

నారాయణపేట జిల్లాలో హయ్యర్​ స్టడీస్​కు దూరమవుతున్న స్టూడెంట్స్​

నారాయణపేట జిల్లాలో ఉన్నత చదువులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పీజీ కాలేజీలు లేకపోవడంతో చాలా మంది డిగ్రీ వరకు చదివి స్టడీ ఆపేస్తున్నారు. హయ్యర్​ స్టడీస్​కు హైదరాబాద్​, మహబూబ్​నగర్​ ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది ఇంట్రెస్ట్​ చూపడం లేదు. ప్రొఫెషనల్​ కోర్సులు చేసే అవకాశమూ జిల్లాలో లేకపోవడంతో ఇక్కడ విద్యా వ్యవస్థ కుంటుపడుతోంది.

నారాయణపేట టౌన్​, వెలుగువిద్యాభివృద్ధిలో నారాయణపేట జిల్లా వెనుకబడుతోంది. జిల్లాకేంద్రంలో పీజీ, ఒకేషనల్​ కాలేజీలు లేవు. హయ్యర్​ స్టడీస్​ కావాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిందే. పేటలో పీజీ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని నాయకులు ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో చదువులో అత్యంత వెనకబడిన ప్రాంతం నారాయణపేట జిల్లానే. జిల్లాలో 5,66,874 మంది జనాభాకు గాను 49.93 శాతం అక్షరాస్యులు ఉన్నారు. విద్యా వనరులు లేకపోవడంతో చాలా మంది చదువుకోలేకపోతున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఎయిడెడ్  కాలేజీగా ఉన్న ఎస్​ఎల్​ డిగ్రీ కాలేజీ 2018లో ప్రభుత్వపరం కాగా.. త్వరలోనే ఇదే కాలేజీకి పీజీ కేంద్రం వస్తుందని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు గత ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. కాలేజీ ఏర్పాటుకు స్థల సమస్య లేకుండా డిగ్రీ కాలేజీలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం, పాలకులు పట్టించుకోవడం లేదు.

ఎమ్మెల్యే ప్రస్తావించినా..

నారాయణపేట జిల్లా కేంద్రంలో పీజీ కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత సంవత్సరం అసెంబ్లీ సమావేశాలతో పాటు ఈ ఏడాది మార్చి సమావేశాల్లో కూడా పీజీ సెంటర్​ విషయాన్ని ప్రస్తావించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా కలిశారు. నారాయణపేట జిల్లాలో దాదాపు 7 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ పైచదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో చాలా మంది హయ్యర్​ స్టడీస్​ చేయలేకపోతున్నారు. కనీసం ఓపెన్​ వర్సిటీ ద్వారానైనా పీజీ సెంటర్​ ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్​ కోరుతున్నారు. ఈ విషయంపై పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చినా నెరవేరలేదు.

ఒకేషనల్ కోర్సులూ లేవు..

నారాయణపేట జిల్లాగా ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క పీజీ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఒకేషనల్​ స్టడీస్​ కూడా జిల్లాలో అందుబాటులో లేకపోవడం శోచనీయం. పీజీ, ఒకేషనల్​ చదువుల కోసం హైదరాబాద్​, మహబూబ్​నగర్​ కు వెళ్లాల్సిందే. మెడికల్​, ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, గర్ల్స్​ డిగ్రీ, జూనియర్​ కాలేజీలు, నవోదన కేంద్రియ విద్యాలయం పాలిటెక్నిక్ వంటి కాలేజీలు కూడా  ఇక్కడ లేవు.

డిగ్రీ చదివి మానేశా..

నేను పోయిన సంవత్సరం డిగ్రీ కంప్లీట్​ చేశారు. పీజీ కోర్సు చేయాలంటే హైదరాబాద్​ లేదా మహబూబ్​నగర్​కు వెళ్లాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నారాయణపేట జిల్లాలో పీజీ కాలేజీలు లేకపోవడం దురదృష్టకరం. చాలా మంది స్టూడెంట్స్​ హయ్యర్​ స్టడీస్​ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఈవిషయంపై దృష్టి పెట్టాలి. -సాయి, వనపర్తి