తెలంగాణ విద్యా విధానం భేష్..ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రూపకల్పన బాగుంది : రోహిత్ కుమార్

తెలంగాణ విద్యా విధానం భేష్..ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రూపకల్పన బాగుంది : రోహిత్ కుమార్
  • సీఎం రేవంత్​తో హిమాచల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రోహిత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ రూపకల్పన పట్ల హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ ఆసక్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ఆయన విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశంసించారు. సెక్రటేరియెట్​లో గురువారం సీఎం రేవంత్ రెడ్డిని రోహిత్ కుమార్ తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్వరూపాన్ని సీఎం ఈ సందర్భంగా వివరించారు. దాదాపు 25 ఎకరాల స్థలంలో, ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లు వెచ్చించి మినీ యూనివర్సిటీని తలపించేలా వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ ఒకే చోట విద్యనందించేలా ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, తద్వారా సామాజిక సమానత్వం సాధించవచ్చని సీఎం పేర్కొన్నారు.

త్వరలో ‘తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ’

జాతీయ విద్యా విధానం తరహాలోనే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా త్వరలో ప్రత్యేకంగా ‘తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ’ని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే ఒక నిపుణుల కమిటీని నియమించామని, వారి నివేదిక రాగానే నూతన విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ప్రీ -ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారులను అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలు, ప్రీ -ప్రైమరీ స్కూళ్లకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే యోచనలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి హిమాచల్ మంత్రికి వివరించారు.

నైపుణ్యాల కోసం ఏటీసీలు

విద్యతో పాటు ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు)గా మారుస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానాన్ని పరిశీలించేందుకు మల్లెపల్లిలోని ఏటీసీని సందర్శించాల్సిందిగా హిమాచల్ మంత్రికి సీఎం సూచించారు.

సీఎం వివరించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ ఆసక్తి కనబరిచారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పాఠశాలల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన సమగ్ర నివేదికను (డీపీఆర్​) తమకు అందించాలని కోరారు.