హిమాన్షు అన్నా.. మా స్కూల్‌‌‌‌నూ దత్తత తీసుకో

హిమాన్షు అన్నా.. మా స్కూల్‌‌‌‌నూ దత్తత తీసుకో

    
బషీర్ బాగ్, వెలుగు: ‘‘హిమాన్షు అన్నా.. మా స్కూల్‌‌‌‌ను కూడా బాగు చేయండి”అంటూ హైదరాబాద్ నారాయణగూడలోని ప్రభుత్వ స్కూల్‌‌‌‌ విద్యార్థులు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మనుమడిని కోరారు. స్కూల్‌‌‌‌లో సరైన వసతులు లేవని, తమ పాఠశాలను దత్తత తీసుకోని సౌలతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఏఐవైఎఫ్, బాల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు. స్కూల్‌‌‌‌లో బాత్రూమ్స్‌‌‌‌ డోర్లు విరిగిపోయాయని, ప్లే గ్రౌండ్ కూడా లేదని, కంప్యూటర్లు లేవని స్టూడెంట్లు తెలిపారు. 

బాత్రూమ్‌‌‌‌ రూమ్ డోర్లు విరిగిపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 24 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో ఇదే పరిస్థితి ఉందని ఏఐవైఎఫ్, బాల సంఘం నాయకులు ధర్మేందర్,షేక్ మహమూద్‌‌‌‌ ఆరోపించారు. మన బస్తీ, మన బడి నిధులు పక్కదారి పట్టిస్తూ, గవర్నమెంట్‌‌‌‌ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 

విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా.. స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు, యూనిఫామ్స్ అందలేదన్నారు. అలాగే, టాయిలెట్లు, లైబ్రరీ, గ్రౌండ్, స్పోర్ట్స్‌‌‌‌ కిట్స్‌‌‌‌ తదితర వసతుల కల్పన జరగలేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లోని సమస్యలను పరిష్కరించాల్సిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆమెను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.