కాంగ్రెస్కు రాజీనామా చేసిన హిమాన్షు వ్యాస్

కాంగ్రెస్కు రాజీనామా చేసిన హిమాన్షు వ్యాస్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత హిమాన్షు వ్యాస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ ఖర్గేకు పంపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్ధుల జాబితాను  ప్రకటించిన అనంతరం వ్యాస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. హిమాన్షు వ్యాస్ సురేంద్రనగర్‌లోని వద్వాన్ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నారు.  

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన హిమాన్షు వ్యాస్ పార్టీ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీలో ఎవరూ తన  మాట వినడం లేదన్నారు.  రాహుల్ గాంధీని కలవడం కష్టమని, అది ఢిల్లీలో కొందరికే సాధ్యమవుతుందని తెలిపారు. గుజరాత్‌లో బీజేపీ గెలుస్తోందని, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని వ్యాస్ జోస్యం చెప్పారు. గుజరాత్‌లో ఆప్ రావడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లితుందన్నారు. 

182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న  మొదటిదశ,  డిసెంబర్ 5 న రెండవ దశ ఎన్నికలు జరగనున్నాయి.  డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2017 ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి వరుసగా ఆరో సారి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయగా 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి 49 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు పడ్డాయి.