సోషల్ మీడియా దిగ్గజాలు మెటా, గూగుల్ సంస్థలకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫారమ్‌ల వ్యసనం వల్ల మానసిక ఆరోగ్యానికి నష్టం వాటిల్లిందని ఒక యువతి దాఖలు చేసిన సివిల్ కేసులో ఈ రెండు కంపెనీలు బాధ్యులని జ్యూరీ తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియా సంస్థలపై కేసు ఏంటి..?
20 ఏళ్ల వయస్సున్న కేలీ జీఎమ్ అనే యువతి.. తాను చిన్నతనం నుంచి సోషల్ మీడియా వాడకం వల్ల డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా బారిన పడ్డానంటూ కోర్టును ఆశ్రయించింది. 8 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ మెటా, గూగుల్ సంస్థలు ఆమెకు 6 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 70 శాతం మెటా సంస్థ, 30 శాతం గూగుల్ చెల్లించాల్సి ఉంటుంది.
పై కోర్టులో తేల్చుకుంటాం..
ఈ తీర్పుపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. తాము దీనిపై అప్పీల్ చేస్తామని చెప్పారు. టీనేజర్ల మానసిక ఆరోగ్యం అనేది చాలా సంక్లిష్టమైన అంశమని, దీన్ని కేవలం ఒక యాప్‌తో ముడిపెట్టలేమని మెటా వాధిస్తోంది. గూగుల్ ప్రతినిధి కూడా స్పందిస్తూ.. యూట్యూబ్ అనేది బాధ్యతాయుతమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అని, అది సోషల్ మీడియా సైట్ కాదని పేర్కొన్నారు. తమ ప్లాట్‌ఫారమ్‌లు పిల్లల కోసం సురక్షితంగానే రూపొందించబడ్డాయని గూగుల్ చెబుతోంది.
బయటపడ్డ కంపెనీల సీక్రెట్స్..
ట్రయల్ సమయంలో మెటా, గూగుల్ సంస్థలకు చెందిన కొన్ని అంతర్గత పత్రాలు బయటపడ్డాయి. అందులో ఒక మెటా ఉద్యోగి "మేము డ్రగ్స్ అమ్మే పుష్షర్ల లాంటి వాళ్లం.. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రజలు ఎంతగా అలవాటు పడుతున్నారంటే అది వారికి రివార్డ్ డెఫిసిట్ డిజార్డర్‌ను కలిగిస్తోంది" అన్న విషయం బయటపడింది. అలాగే టీనేజర్లను ఆకర్షించాలంటే వారిని చిన్నప్పుడే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని యూట్యూబ్ స్ట్రాటజీ మెమోలో ఉన్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని బ్యూటీ ఫిల్టర్లు కేలీలో తాను లావుగా ఉన్నాననే భావనను పెంచాయని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
ఈ తీర్పు అమెరికా చరిత్రలోనే మొదటిది కావడం విశేషం. ప్రస్తుతం సౌత్ కాలిఫోర్నియాలో గూగుల్, మెటా, టిక్‌టాక్, స్నాప్‌లపై దాదాపు 2,500 మంది ఇలాంటి కంప్లెయింట్స్ చేశారు. బుధవారం వచ్చిన ఈ తీర్పు మిగిలిన కేసులకు ఒక మార్గదర్శిగా మారే అవకాశం ఉందని అమెరికాలోని న్యాయ నిపుణులు అంటున్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ విచారణలో సాక్ష్యం ఇచ్చారు. కేలీ తరపు న్యాయవాది మార్క్ లానియర్ మాట్లాడుతూ.. ఈ విజయం సోషల్ మీడియా వల్ల ప్రభావితమైన తరానికి దక్కిన గొప్ప గౌరవంగా వ్యాఖ్యానించారు.
