వ్యవసాయం చేస్తమని కొని.. వెంచర్లు వేస్తున్నరు

V6 Velugu Posted on Sep 24, 2021

హైదరాబాద్, వెలుగు: జీవో 111 పరిధిలో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతుండగా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిషేదిత ఏరియాలో రియల్​దందాకు అడ్డులేకుండా పోయింది. అక్కడ నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వడం లేవని ఆఫీసర్లు చెబుతుండగా, మరోవైపు ఎలా కడుతున్నారనేది తెలియట్లేదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను పరిరక్షించే లక్ష్యంతో రెండు దశాబ్దాల కిందట ప్రభుత్వం జీవో 111 అమలులోకి తెచ్చింది. శంషాబాద్‌‌, మొయినాబాద్‌‌, రాజేంద్రనగర్‌‌, శంకర్‌‌పల్లి, చేవెళ్ల, షాబాద్‌‌ మండలాల్లోని 84 గ్రామాల్లో భారీ నిర్మాణాలను నిషేధించింది. ఆయా గ్రామాలకు చెందిన లక్షల ఎకరాల భూములను ఆ జీవో పరిధిలోకి తీసుకొచ్చింది.  ప్రభుత్వం నిషేధించిన ప్రాంతంలో ఇష్టానుసారంగా  నిర్మాణాలు, భవనాలు పుట్టుకొస్తుండగా రియల్ ఎస్టేట్ బిజినెస్​జోరుగానే ఉంది. వ్యవసాయం కోసమంటూ రైతుల వద్ద తక్కువ ధరకే భూములు కొంటున్న రియల్టర్లు, ఆ తర్వాత వెంచర్లు చేస్తున్నారు. 

వేలల్లో అక్రమ కట్టడాలు తేల్చినా..

జీవో 111 పరిధిలోని 84  గ్రామాల్లో  ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలపైన కొంతకాలం కిందట అధికారులు సర్వే చేశారు. సుమారు12 వేలకుపైగా అక్రమంగా నిర్మించినట్లు సర్వేలో తేలింది. వాటిల్లో ఏ ఒక్క నిర్మాణానికి పర్మిషన్​లేదని స్పష్టమైంది. ఇంకా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉండగా, మొయినాబాద్, శంషాబాద్ మండలాల్లోనే ఎక్కువగా నిర్మిస్తున్నారు. హెచ్ఎండీఏ, స్థానిక సంస్థల అధికారులు నిర్మాణాలకు పర్మిషన్లు లేవని చెబుతున్నారే తప్ప ఆపడం లేదు.  వాటిని అడ్డుకోవడంలో హెచ్ఎండీఏ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ బిల్డర్లు, డెవలపర్లు నిర్మాణాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మొయినాబాద్ మండలానికి చెందిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

2018లో కేసీఆర్ ​ప్రకటన తర్వాత..

జీవో 111 రద్దు చేస్తామని 2018లో ఎన్నికలకు ముందు కేసీఆర్  ప్రకటన చేయగా అనంతరం రియల్ ఎస్టేట్​ బిజినెస్​ భారీగా పెరిగిపోయింది.  ఒక్క శంషాబాద్ మండలంలోనే 250కి పైగా అక్రమ వెంచర్లు, 2 వేలకు పైగా నిర్మాణాలు కట్టినట్టు అధికారులు సర్వేలో తేల్చారు. ఇప్పుడు వాటి సంఖ్య మరింతగా పెరిగి ఉండొచ్చని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జీవో 111  ప్రాంతంలో న్యూ సిటీ ఏర్పాటుకు అవకాశం ఉందని ఇటీవల అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొనగా, దీంతో రియల్ బిజినెస్​కు మరింత ప్రచారం దొరికింది. జీవో రద్దు చేస్తే ఇప్పటికే అమ్ముకున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని,  రియల్టర్లు లబ్ధి పొందుతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జీవోపై ఏదో ఒకటి తేల్చాలె: చిన్న గోల్కొండ పీఏసీఎస్ మెంబర్ అనంత్ రెడ్డి

శంషాబాద్:రైతులకు జీవో 111 ఇబ్బందిగా మారిందని, దీనిపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ధిష్టమైన స్పష్టత ఇవ్వాలని చిన్న గోల్కొండ పీఏసీఎస్​( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) మెంబర్ గుర్రం అనంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో111 పై సీఎంతో సహా ప్రజాప్రతినిధులు, పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నారని, ప్రజలను మోసగిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో  ఎన్నో చెరువులు కబ్జా అయ్యాయని ఆరోపించారు. జీవో రూల్స్​పాటించకుండా కొంతమంది రియల్టర్లు లే ఔట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటుంటే  రాష్ర్ట సర్కార్​ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బడా నేతలు వెంచర్లు చేసి, భారీ భవనాలు నిర్మిస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శించారు. పేదలు మాత్రం 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే  వారిపై  పలు ఆంక్షలు పెట్టి నిర్మాణాలు కూల్చుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో111ను కఠినంగా చేయడమా.. తొలగించడమా చేయాలని కోరారు.

ప్రభుత్వం, అధికారుల ప్రకటనలతోనే..​

జీవో 111 పరిధిలోని భూముల్లో రియల్ ఎస్టేట్ జరుగుతుంటే హెచ్ఎండీఏ, స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే అక్రమ కట్టడాలపై నివేదిక రూపొందించాలి. అభివృద్ధి పేరిట సాగే నిర్మాణాలు జంట జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాకు ఇబ్బందిగా మారుతాయి. జీవోను రద్దు చేస్తామని లేదా, సవరిస్తామంటూ ప్రభుత్వం, అధికారుల వేర్వేరు ప్రకటనలే రియల్ భూమ్​కు కారణంగా మారాయి. 
- ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్, సామాజిక కార్యకర్త

Tagged real estate, HMDA, LANDS, Ventures, local authorities , GO 111lands

Latest Videos

Subscribe Now

More News