- 10 అంతస్తులు దాటితే హెచ్ఎండీఏ అప్రూవల్ తప్పనిసరి
- ఆ లోపు ఉన్న బిల్డింగ్స్‌కు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ అనుమతులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్ భవనాల అనుమతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి (ఎంఎంసీ), సైబరాబాద్ (సీఎంసీ) మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తుండే భవన నిర్మాణాలకు అనుమతినిచ్చే అధికారం హెచ్‌ఎండీఏకే కట్టబెట్టింది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో హైరైజ్ బిల్డింగ్ అప్రూవల్స్ జీహెచ్ఎంసీనే ఇచ్చేది.
కానీ తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 45 ప్రకారం 10 అంతస్తుల వరకే స్థానిక కార్పొరేషన్లకు పరిమితం చేసి, అంతకు మించి కట్టే భారీ ఆకాశహర్మ్యాల బాధ్యతను హెచ్‌ఎండీఏకు బదిలీ చేశారు. అలాగే మూడు కార్పొరేషన్ల పరిధిలో భవనాల అప్రూవల్స్, లేఅవుట్ల పర్మిషన్స్ సమయంలో వసూలు చేసే డెవలప్మెంట్చార్జీలను మాత్రం హెచ్ఎండీఏ షేర్ చేస్తుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
హెచ్ఎండీఏకు ఇక కాసుల పంట
లోకల్ బాడీలతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైరైజ్ భవనాల అనుమతుల అధికారాన్ని ప్రభుత్వం హెచ్‌ఎండీఏకే బదిలీ చేయడంతో ఆ సంస్థ ఆదాయం 2026లో మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2025లో బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ల ద్వారా రూ.1,225 కోట్ల ఆదాయం సాధించిన హెచ్‌ఎండీఏ.. తాజా నిర్ణయంతో మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పరిధిలోని కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నార్సింగి వంటి ప్రాంతాలతో పాటు మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్, ఉప్పల్, శామీర్‌పేట ప్రాంతాల్లో వెలుస్తున్న 50 నుంచి- 60 అంతస్తుల ఆకాశహర్మ్యాల అనుమతులన్నీ ఇకపై హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని శంషాబాద్లోఇటీవల కాలంలో భారీ సంఖ్యలో హైరైజ్ భవనాలు నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
2025 మొదటి తొమ్మిది నెలల్లోనే 88 లక్షల చ.మీ. బిల్టప్ ఏరియాకు అనుమతులు మంజూరు చేయగా, ఈ ఏడాది కూడా బిల్టప్ ఏరియా అనుమతులు భారీగా పెరుగుతాయని అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు అన్ని రకాల నిర్మాణాలకు కలిపి కొత్తగా దాదాపు 350 కి పైగా అనుమతులు జారీ అయినట్టు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ విస్తరణ నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా మందగించినా, కొత్త పాలసీతో హైరైజ్ భవనాల అనుమతుల ద్వారా హెచ్‌ఎండీఏ ఖజానాకు త్వరలో భారీగా నిధులు సమకూరడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.
