హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో రోజు రోజుకూ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. కొత్త నిర్మాణాల కోసం హెచ్ఎండీఏకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అధికారులు ఫీల్డ్విజిట్చేయడంలోనూ, సర్టిఫికెటర్ల పరిశీలనతో ఆలస్యం చేస్తుండడంతో ఎక్కువ శాతం పెండింగ్‌లో పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పెండింగ్ ఫైళ్లను ఒక నిర్ధిష్ట కాలపరిమితి ప్రకారం విభజించి పరిశీలించే యంత్రాంగాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. 60 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్న ఫైళ్లు, 30 నుంచి 60 రోజుల వరకు, 30 రోజుల్లోపు, వారంలోపు ఇలా విభజించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గత 9 నెలల్లో సంస్థకు మంచి ఆదాయం వచ్చిందని అధికారులు చెప్తున్నారు. 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను సీరియస్గా మానిటరింగ్ చేసి రోజూ ఫాలో అప్చేయడం వల్ల 2 శాతం లోపు తగ్గించగలిగామని అధికారులు వెల్లడించారు.
ఆదాయం పెరిగింది ఇలా..
2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ 9 నెలల్లో పర్మిషన్ల జారీలో తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. 2024, 2023 సంవత్సరాల్లో నెలవారీ ఆదాయంతో 2025ను పోలిస్తే ఎక్కువ ఆదాయం వచ్చిందంటున్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే రూ. 132 కోట్లు వచ్చిందంటున్నారు.
2025 మొదటి తొమ్మిది నెలల్లో 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా రూ.514 కోట్ల ఆదాయాన్ని సాధించగలిగామన్నారు. ఇది 2023లో 37.03 లక్షల చదరపు మీటర్లు కాగా, ఆదాయం రూ.215 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, నగర విస్తరణలో భాగంగా ఈ సంవత్సరం 88.15 లక్షల చదరపు మీటర్ల భారీ మల్టీ-స్టోరీడ్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామంటున్నారు.
