OTT Review: తప్పిపోయిన గర్భిణీ ఆవు కోసం అన్నదమ్ముల అన్వేషణ.. ఓటీటీలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘వలవార’

OTT Review: తప్పిపోయిన గర్భిణీ ఆవు కోసం అన్నదమ్ముల అన్వేషణ.. ఓటీటీలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘వలవార’

ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి అనుభూతినిచ్చే కన్నడ ఫీల్‌గుడ్ మూవీ ‘వలవార’ (Valavaara). ఎమోషనల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సతన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2026 జనవరి 30న థియేటర్లలో విడుదల కాగా, ప్రస్తుతం జీ5లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ మారుమూల గ్రామంలో తప్పిపోయిన గర్భిణీ ఆవును వెతికే ఇద్దరు అన్నదమ్ముల ప్రయాణమే ఈ కథ.

వేదిక్ కౌశల్, షయన్, మాలతేష్ హెచ్.వి, హర్షిత గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణికాంత్ కద్రి సంగీతం అందించారు. పల్లెటూరి జీవనశైలిని సహజంగా చూపించిన తీరు, సింక్ సౌండ్ టెక్నాలజీ వినియోగం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడదగ్గ హృద్యమైన కుటుంబ కథగా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది.

కథేంటంటే:

ఓ మారుమూల గ్రామంలో పంటపొలాల మధ్య ఉన్న ఇంట్లో కుందేశి (కౌశల్) తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. తండ్రి కుందేశిని ఎప్పుడూ కోప్పడుతుంటాడు. ఒకరోజు ముఖ్యమైన పనిమీద తండ్రి సిటీకి వెళ్తాడు. కుందేశి తన తమ్ముడితో కలిసి గర్భిణీగా ఉన్న ‘గౌరీ’ అనే తమ ఆవును మేపడానికి తీసుకెళ్తాడు. అయితే అది వేరేవాళ్ల పొలంలో మేయడంతో వాళ్లు దాన్ని తమ కొట్టంలో కట్టేస్తారు.

ఆవును తిరిగి తీసుకెళ్లాలంటే రెండు వందల రూపాయలు చెల్లించాలని చెప్తారు. దాంతో తల్లి పక్కింటి మహిళ దగ్గర రూ.200లు తీసుకుని కొడుక్కి ఇస్తుంది. కానీ వెళ్లే దారిలో ఆ డబ్బు ఎక్కడో పోగొట్టుకుంటాడు. ఎంత వెతికినా ఆ నోటు దొరకదు. తండ్రి తిరిగి వచ్చేలోపు ఆవును ఇంటికి తీసుకురాకపోతే ఏం జరుగుతుందో కుందేశికి బాగా తెలుసు. మరి కుందేశి ఏం చేశాడు? అసలు కుందేశి అంటే తండ్రికి ఎందుకంత కోపం? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

గ్రామీణ నేపథ్యంలో సాగే కథలు అరుదుగా వస్తున్న తరుణంలో 'వలవార' ఒక స్వచ్ఛమైన అనుభూతిని అందించే చిత్రంగా నిలుస్తుంది. కథ చాలా చిన్నదే అయినప్పటికీ, దాన్ని దర్శకుడు సతన్ గౌడ హృద్యంగా, సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించారు. ఇద్దరు చిన్నారుల అమాయకత్వం, వారి భయాలు, తండ్రి కోపం నుంచి తప్పించుకోవాలనే ఆరాటం ప్రేక్షకులను కథతో కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

►ALSO READ | Vijay Deverakonda: రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్‌షిప్‌లపై విజయ్ దేవరకొండ కీలక ప్రకటన!

సినిమాకు ప్రధాన బలం పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా చూపించిన తీరు. సింక్ సౌండ్ టెక్నాలజీ వినియోగం వల్ల ప్రకృతి శబ్దాలు, గ్రామీణ జీవనశైలి మరింత సహజంగా అనిపిస్తాయి. మణికాంత్ కద్రి అందించిన నేపథ్య సంగీతం కూడా కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తుంది.

కుందేశి పాత్రలో వేదిక్ కౌశల్ తన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. తమ్ముడి పాత్రలో షయన్ కూడా చక్కటి నటన కనబరిచాడు. తండ్రి పాత్రలో మాలతేష్ హెచ్.వి తనదైన శైలిలో మెప్పించారు. పెద్దగా హడావుడి లేకుండా, జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనలతో సాగే ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్, ఫీల్‌గుడ్ సినిమాలను ఇష్టపడేవారికి 'వలవార' మంచి ఛాయిస్.