‘ఓఆర్ఆర్’ ఆమ్దానీపై హెచ్ఎండీఏ ఫోకస్

‘ఓఆర్ఆర్’ ఆమ్దానీపై హెచ్ఎండీఏ ఫోకస్

 

  •     రెండేళ్ల కాంట్రాక్టు,  రూ.700 కోట్లు ఆదాయం
  •     టోల్ వసూళ్లతో పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకే

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ల నిర్వహణ టెండర్లతో వచ్చే ఆదాయంపై హెచ్ఎండీఏ దృష్టిపెట్టింది. ఏటా రూ.700 కోట్ల ఆదాయం వచ్చేలా రెండేళ్లు అప్పగించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియగా.. కంపెనీల ఎంపిక కూడా తుదిదశకు చేరినట్లు తెలిసింది. వచ్చే ఏడాది రెండో వారం నుంచి టెండర్లు దక్కించుకున్న కంపెనీలు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా గతంలో కంటే భారీగా ఆదాయంతో పాటు, పూర్తి నిర్వహణ బాధ్యతలను కంపెనీలే చూసుకునేలా టెండర్లు పిలవనున్నారు. 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ పై మొత్తం 19 టోల్ గేట్లు ఉండగా.. అదనంగా మరో రెండు టోల్ ప్లాజాల నిర్మాణం కొనసాగుతున్నది. దాదాపు 18 నెలల పాటు టోల్ ప్లాజాల నిర్వహణకు హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్ టెండర్ల ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు పూర్తి చేశారు. ఏటా పెరుగుతున్న వాహనాలతో రోడ్డు నిర్వహణ భారంగా మారింది. ఇక ప్రభుత్వం చెల్లించాల్సిన గ్రాంట్ కూడా రిలీజ్ చేయకపోవడంతో హెచ్ఎండీఏ ఖజానా నుంచే జైకాకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓఆర్ఆర్ ను ఆదాయ వనరుగా భావించి, అధిక ఆదాయం వచ్చేలా టెండర్లను చేపట్టింది.

రూ.700 కోట్ల రెవెన్యూ...
ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీని బట్టి టెండర్లను ఫైనల్ చేసింది హెచ్ఎండీఏ. రెండేళ్లకు గాను రూ.700 కోట్ల రెవెన్యూ వచ్చేలా, 8 నెలల పాటు టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఈ ఏడాది ఒక్క ఆగస్టు నెలలోనే రూ.13.34 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా గతేడాదిలోనే గడువు ముగిసినా, ఒక ఏడాది పొడిగించారు. నెల రోజుల కిందట పెంచిన గడువు ముగియడంతో.. కొత్తగా టెండర్ల ప్రక్రియను చేపట్టగా, ఈసారి జాతీయ స్థాయిలో 10 కంపెనీలు హాజరైనట్లు తెలిసింది. జనవరి – 2022లో రెండో వారంలో కంపెనీలకు బాధ్యతలు అప్పగించనున్నారు.

తొలిసారిగా టీవోటీ విధానం...
ఓఆర్ఆర్ వెంబడి తొలిసారిగా టీవోటీ విధానాన్ని హెచ్ఎండీఏ అవలంభిస్తోంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో ఇచ్చిన రెండేళ్ల గడువుతో పాటు, ఓఆర్ఆర్ మెయింటెనెన్స్​ కూడా టెండర్ దక్కించుకున్న కంపెనీలే చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం సంస్థ చేపట్టే పనులను క్వాలిటీ స్టాండర్డ్స్ ను హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తోంది. దీంతో నిర్వహణ భారం తగ్గడంతో పాటు, క్వాలిటీ స్టాండర్డ్స్​లో జాప్యం జరగే అవకాశం ఉండదని హెచ్ఎండీఏ వర్గాలు చెప్తున్నాయి.