సిల్ట్ చాంబర్లు లేకపోతే సీవరేజీ పైప్​లైన్ కట్: వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి వెల్లడి

సిల్ట్ చాంబర్లు లేకపోతే సీవరేజీ పైప్​లైన్ కట్: వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి వెల్లడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ ​పరిధిలోని హోటళ్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లు, అపార్ట్​మెంట్లు, ఇతర బహుల అంతస్తుల భవనాల నిర్వాహకులు తప్పకుండా సిల్ట్​చాంబర్లు నిర్మించుకోవాలని నోటీసులు ఇస్తున్నట్లు వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. ఫుడ్, ఇతర వ్యర్థాలను నేరుగా సీవరేజీ నాలాల్లోకి పంపిస్తే ఎక్కడికక్కడ బ్లాక్​అయ్యి, మ్యాన్​హోళ్లు పొంగుతున్నాయని చెప్పారు.

నోటీసులు అందుకున్నాక కూడా సిల్ట్​చాంబర్​నిర్మించుకోకపోతే సీవరేజీ పైప్​లైన్ కనెక్షన్ ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన స్పెషల్​డ్రైవ్​లో భాగంగా మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టోలిచౌకి ప్రాంతాల్లో చేస్తున్న డీ-సిల్టింగ్ పనులను పరిశీలించారు. మెహిదీపట్నం అంబా థియేటర్ వద్ద మెయిన్​రోడ్డుపై తరచూ పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు.

టోలీచౌకిలో సీవరేజ్ అవుట్​లెట్ లేని లైన్లను కొత్తగా నిర్మిస్తున్న జోన్- 3 సీవరేజ్ నెట్ వర్క్ కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూసీ నదికి నార్త్​వైపున ఉన్న కోర్ సిటీలో సీవరేజ్​వ్యవస్థ ఆధునీకరణకు జోన్ 3 సీవర్ నెట్​వర్క్​ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా రూ.297 కోట్ల ఖర్చుతో 129.32 కిలోమీటర్ల మేర పైపులైన్​నిర్మాణాన్ని చేపడుతున్నారు. గోషామహల్, నాంపల్లి, కార్వాన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని సీవరేజీ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.